Roja Ramani: ఎన్టీఆర్ గారు నా కాళ్ల దగ్గర కూర్చోగానే ఏడ్చేశాను: రోజా రమణి
- ఎన్టీఆర్ తో మంచి సినిమాలు చేశానన్న రోజారమణి
- ఆయన దర్శకత్వంలో చేయడం అదృష్టమని వ్యాఖ్య
- తాను పడిపోకుండా పట్టుకున్నారని వెల్లడి
- అది ఆయన గొప్పతనమని వివరణ
రోజా రమణి .. బాలనటి నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వెళ్లారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా .. హీరోయిన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా ఆమె మంచి గుర్తింపు తెచుకున్నారు. ఎన్టీఆర్ తో కలిసి ఆమె కొన్ని సినిమాలలో నటించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో కూడా ఆమె ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆ విషయాలను గురించి తాజాగా 'ట్రీ మీడియా' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడారు.
"రామారావుగారి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా షూటింగు విజయవాడ కృష్ణా బ్యారేజ్ పై జరిగింది. నేను ఆ బ్రిడ్జ్ పై నుంచి నదిలో దూకేయాలి. కెమెరా డిపార్టుమెంటువారు బ్రిడ్జ్ క్రింద ఉన్నారు. దూకుతున్నట్టుగా నేను మూమెంట్ ఇవ్వాలి. అయితే కెమెరాలో నా ముఖం కనిపించాలంటే నా కాళ్ల క్రింద స్టూల్ లాంటిది కావాలి. కానీ అది అందుబాటులో లేదు. దగ్గరలో ఓ వ్యక్తి దగ్గర ప్లాస్టింగ్ క్యాన్స్ ఉంటే, వాటిపై నిలబడమని ఎన్టీఆర్ చెప్పారు. ఆ క్యాన్స్ జరగకుండా పట్టుకోమని ఓ అబ్బాయికి చెప్పారు.
ఆ క్యాన్స్ నా బరువుకు ఆగేలా లేవు .. ఏను ఎక్కగానే అవి జారిపోయేలా ఉన్నాయి. అలా జారిపోతే నేను నిజంగానే నీళ్లల్లో పడిపోతాను. ఆ క్యాన్స్ జరగకుండా ఆ అబ్బాయి ఆపలేకపోతున్నాడు. అది గమనించిన ఎన్టీఆర్, 'అమ్మాయి నువ్వేమీ భయపడకు .. నీ యాక్షన్ నువ్వు పెర్ఫెక్ట్ గా చేయి', అంటూ నా దగ్గరికి వచ్చి ఒక చేత్తో ఒక కాలు .. మరో చేత్తో క్యాన్స్ పట్టుకున్నారు. అంతే ఆ సీన్లో నిజంగానే నాకు ఏడుపు వచ్చింది. అదీ ఎన్టీఆర్ .. అదీ ఆయన గొప్పతనం" అనిపించింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.