Mothkupalli Narsimhulu: రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు
- మాదిగ జాతిని ఎదగకుండా బొందపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ
- సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం
- ముఖ్యమంత్రి ఏ పథకం మీదా దృష్టి సారించడం లేదని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ కంటే కేసీఆరే నయం అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మాదిగ జాతిని ఎదగకుండా బొందపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రగతి భవన్‌లో ప్రజాపాలన అని పెట్టి మూడు రోజులకే మూసేశారన్నారు. ప్రజాపాలన అంటూ ఒక్కసారి వచ్చి దరఖాస్తులు తీసుకున్న ముఖ్యమంత్రి మళ్లీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు లేదు.. రైతుబంధు ఊసు లేదు... తులం బంగారం లేదు, రూ.2500 ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోందన్నారు. పేరుకే ప్రజాపాలన... కానీ అదేమీ కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఏ పథకం మీదా దృష్టి సారించడం లేదన్నారు. ఏమైనా అంటే డబ్బులు లేవని అంటున్నారని... పైసల్ లేవంటే ఇక ముఖ్యమంత్రిగా ఎందుకని విమర్శించారు. ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదని తెలుసుకోవాలన్నారు.