Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అసోం కాంగ్రెస్ నాయకుడి అరెస్ట్... ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు
- నిందితుడిని రితోమ్ సింగ్‌గా గుర్తించినట్లు తెలిపిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
- మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న వ్యాఖ్యల స్థానంలో రిజర్వేషన్లనే రద్దు చేస్తామన్నట్లుగా వీడియో ఎడిట్
- దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు
- పోలీసుల ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అసోం పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం తెలిపారు. నిందితుడిని రితోమ్ సింగ్‌గా గుర్తించినట్లు చెప్పారు. అతను అసోం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ కో-ఆర్డినేటర్ అని పోలీసులు చెప్పినట్లు తెలిపారు. ఎడిట్ చేసిన వీడియోలు, అసభ్యకరమైన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు రితోమ్ సింగ్‌పై పోలీసులు అభియోగాలు మోపారు.
అమిత్ షా మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబితే ఆ ప్రకటనను పూర్తిగా రిజర్వేషన్లనే రద్దు చేస్తున్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా అమిత్ షా మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. మతపరమైనం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తెలంగాణలో సీఎం రేవంత్ సహా వీరికి నోటీసులు
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పోలీసులు దేశవ్యాప్తంగా 10 మంది కాంగ్రెస్ నాయకులకు సమన్లు జారీ చేశారు. ఇందులో ఆరుగురు తెలంగాణ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్, నవీన్, శివకుమార్, తస్లిమ్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. పదిమందిలో అసోంకు చెందిన రితోమ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. మే 1న ఉదయం పదిన్నర గంటలకు ఫేక్ వీడియో పోస్ట్ చేసిన గాడ్జెట్, రికార్డ్ చేసిన గాడ్జెట్‌ను తీసుకొని రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు
పోలీసుల ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు ఉన్నాయి. అమిత్ షా ఫేక్ వీడియో కారణంగా మతసామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చునని హెచ్చరించారు. ఒరిజినల్ వీడియోను మార్ఫింగ్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ పేర్లను జోడించినట్లు పేర్కొన్నారు.