Nara Brahmani: 2019లో మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయాక సేఫ్ సీటు చూసుకోమని సూచించారు: నారా బ్రాహ్మణి
- మంగళగిరి ప్రజలను తన కుటుంబ సభ్యులుగా లోకేశ్ భావిస్తున్నారన్న భార్య
- అందుకే మళ్లీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారని వెల్లడి
- ప్రభుత్వ సహకారం లేకపోయినా ఐదేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2019లో మంగళగిరి స్థానంలో నారా లోకేశ్ ఓటమిని చవిచూడడంతో చాలా మంది ఏదైనా సేఫ్ సీటు చూసుకోవచ్చు కదా.. కుప్పం లాంటి సీటు చూసుకోవచ్చు కదా? అని సలహా ఇచ్చారని లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి తెలిపారు. అయితే మంగళగిరి ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేనని లోకేశ్ అన్నారని, దేశంలోనే ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్‌గా, నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారని, అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నారని బ్రాహ్మణి చెప్పారు. అందుకే గత ఐదేళ్లుగా మంగళగిరిలో లోకేశ్ కష్టపడుతున్నారని, అంకితభావంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆమె ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా 29 సంక్షేమ పథకాలను ఆయన ఇక్కడ కొనసాగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో నారా బ్రాహ్మణి మాట్లాడారు. అలాగే స్థానిక మహిళలతో ఆమె ముచ్చటించారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేశ్ మద్దతే కారణమని బ్రాహ్మణి అన్నారు. తనకు అందించిన మద్దతునే మంగళగిరి నియోజకవర్గంలోని మహిళలందరికీ అందించాలని లోకేశ్ భావిస్తున్నారని, ఇదే ఆయన విజన్ అని ఆమె అన్నారు. గతంలో హెరిటేజ్ కంపెనీలో తనతో పాటు నారా లోకేశ్ కూడా బాధ్యతలు చూశారని, మహిళలు రాత్రీపగలు కష్టపడి గ్రామాల్లో పాలు ఉత్పత్తి చేసి హెరిటేజ్ కంపెనీకి అందిస్తే వారికి మంచి ఆదాయం దక్కేలా చూసేవారమని తెలిపారు. ఆదాయంతో పాటు వారి గ్రామాల్లో, సమాజంలో, వారి కమ్యూనిటీల్లో వారి విలువ చాలా పెరిగిందని, అది చూసి తమకు చాలా సంతృప్తిగా అనిపించేదని చెప్పారు. ముందు ముందు మహిళలకు ఏం చేసినా వారిమీద సానుకూల ప్రభావం ఉండేలే, ఆదాయం వచ్చేలా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నామని ఆమె వెల్లడించారు.
నాడు తాము పొందిన సంతృప్తి కంటే స్త్రీ శక్తి పథకం ద్వారా మరింత ఎక్కువ సంతృప్తిని కలుగుతుందని నారా బ్రాహ్మణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని రూపొందించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మంగళగిరిలోని మహిళలు అందరూ తమ కాళ్లపై తాము నిలబడాలనేది నారా లోకేశ్ విజన్ అని అన్నారు.