Nara Brahmani: లోకేశ్ విపక్షంలో ఉంటూనే ఇన్ని చేశారు... గెలిస్తే ఇంకెన్ని చేస్తారో!: నారా బ్రాహ్మణి

Nara Brahmani campaigns for Lokesh in Mangalagiri

  • మంగళగిరిలో నారా బ్రాహ్మణి విస్తృత పర్యటన
  • లోకేశ్ తరఫున ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం
  • తాడేపల్లి రూరల్ చైతన్య తపోవన కల్యాణ మండపంలో మహిళలతో భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. తన భర్త నారా లోకేశ్ తరఫున ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. విస్తృతంగా పర్యటిస్తూ, వివిధ వర్గాలతో భేటీ అవుతూ లోకేశ్ కు మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. తాజాగా, తాడేపల్లి రూరల్ నులకపేట చైతన్య తపోవన కల్యాణ మండపంలో స్త్రీ శక్తి లబ్ధిదారులు, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇంటికి దీపం ఇల్లాలు అంటారని, ఇంటిని చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని అన్నారు. 

"తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఎన్టీఆర్ మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే రాజకీయాల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాలు, కళాశాలల్లో యువతులకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. మహిళల పేరిట ఇళ్ల స్థలాలు, పట్టాలు, రుణాలిచ్చారు. మహిళలు ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించేలా డ్వాక్రా సంఘాలను నెలకొల్పి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దీపం పథకంతో 65 లక్షల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేస్తున్న లోకేశ్ గారు... ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని చేస్తారో ప్రజలు ఆలోచించాలి. లోకేశ్ గారి మనసుకు దగ్గరైన పథకం స్త్రీ శక్తి. ఈ పథకాన్ని ఒక్క మంగళగిరిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని లోకేశ్ భావిస్తున్నారు. మంగళగిరిలో స్త్రీ శక్తి, పెళ్లికానుకలు, ఎన్టీఆర్ సంజీవని వంటి 29 పథకాలను అమలు చేస్తున్నారు.

మా పెళ్లయిన తర్వాత ఉన్నత విద్య అభ్యసించేందుకు లోకేశ్ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నేను చదువు నిమిత్తం రెండుసార్లు అమెరికా వెళ్లానంటే అందుకు లోకేశ్ ప్రోత్సాహమే కారణం. నన్ను ప్రోత్సహించినట్టే మంగళగిరి నియోజకవర్గంలోని ప్రతి మహిళ వారి సొంత కాళ్లపై నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. 

స్త్రీ శక్తి పథకం ద్వారా 2,600 మంది టైలరింగ్ నేర్చుకుని ఉపాధి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక స్వావలంబనకు మరిన్ని పథకాలు రూపొందించి అమలు చేస్తాం.

అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా మార్చేందుకు లోకేశ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తాం" అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు.

కూరగాయల మార్కెట్ పడగొట్టి మా బతుకులు రోడ్డుకీడ్చారన్న అభాగ్యులకు బ్రాహ్మణి భరోసా

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి కూరగాయల మార్కెట్ ను పడగొట్టి తమ బతుకులను రోడ్డుకీడ్చారని కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి కాళీమాత ఆలయం దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ ను బ్రాహ్మణి సోమవారం రాత్రి సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. 

మార్కెట్ పడగొట్టడం వల్ల తమకు షెల్టర్ లేకుండాపోయిందని వ్యాపారులు వాపోయారు. దళారుల బెడద కూడా ఎక్కువగా ఉందని, కూరగాయలకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరిలో కూరగాయల వ్యాపారుల కోసం మార్కెట్ నిర్మిస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. 

వ్యాపారుల కష్టాలపై లోకేశ్ కు అవగాహన ఉందని, లోకేశ్ ను ఆదరించి అసెంబ్లీకి పంపితే  చిరు వ్యాపారులకు ప్రభుత్వం నుంచి లోన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. అంతకుముందు కూరగాయల మార్కెట్ పక్కనే ఉన్న కాళీమాత ఆలయంలో బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు.

  • Loading...

More Telugu News