10th Results: తెలంగాణ ‘పది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల వెల్లడి
- జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు
- ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహణ
- రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం నేటి నుంచి దరఖాస్తుల
- టెన్త్ ఫలితాల్లో నిజామాబాద్ టాప్.. వికారాబాద్ లాస్ట్
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయి. జూన్ 3 నుంచి 13 వరకు వీటిని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంటూ విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం టైంటేబుల్ విడుదల చేశారు. తాజాగా వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు మే 16వ తేదీలోపు వారు చదువుకున్న పాఠశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు. ఇక, మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం నేటి నుంచి 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్‌కు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు రూ. 1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఉదయం విడుదలైన ఫలితాల్లో ఎప్పటిలానే బాలికలే పైచేయి సాధించారు. వారు 93.23 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా అత్యధికంగా 99.5 శాతం ఉత్తీర్ణతతో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. గతేడాది కూడా నిర్మల్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక, తాజా ఫలితాల్లో వికారాబాద్ జిల్లా 65.10 శాతంతో అట్టడుగున నిలిచింది. 3,927 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థుల్లో 98.71 శాతం ఉత్తీర్ణత నమోదైంది.