Jagan: బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది... అందుకే...!: కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- అన్నమయ్య జిల్లా కలికిరిలో సీఎం జగన్ ఎన్నికల సభ
- చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో మోసపూరితం అని విమర్శలు
- ఆ విషయం బీజేపీకి అర్థమై మేనిఫెస్టోపై మోదీ ఫొటో వద్దన్నారని వ్యాఖ్య
ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడంపై సీఎం జగన్ స్పందించారు. అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ, మళ్లీ ఈ ముగ్గురూ కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు.
మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ సాధ్యం కాని హామీలు, సాధ్యం కాని మాటలతో సూపర్ సిక్స్ అంటున్నారు, సూపర్ సెవెన్ అంటున్నారు... మీరు నమ్ముతారా? ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటున్నారు... నమ్ముతారా? ప్రతి ఇంటికీ బెంజి కారు కొనిస్తామంటున్నారు... నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు.
"చంద్రబాబు విశ్వసనీయత, ఆయన సాధ్యం కాని హామీలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు. 2014లో ఇదే చంద్రబాబు, ఆయన పక్కన మోదీ, ఆయన పక్కన దత్తపుత్రుడు ఫొటోలు పెట్టుకుని, సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపించిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా హామీ నెరవేర్చారా?
ఇవాళ చంద్రబాబు మేనిఫెస్టో డిక్లేర్ చేస్తే ఏం జరిగిందో తెలుసా...! పై నుంచి బీజేపీ వాళ్లు ఫోన్ చేసి... అయ్యా నీ ఫొటోనే పెట్టుకో, మోదీ ఫొటో మాత్రం మేనిఫెస్టోపై పెట్టొద్దంటే పెట్టొద్దు... మేం ఒప్పుకోం అని అన్నారు. ఈయన సాధ్యం కాని హామీలు మోసపూరితం అని వాళ్లకు కూడా అర్థమైంది. చంద్రబాబు ఇవాళ మేనిఫెస్టోపై ముగ్గురి ఫొటోలు పెట్టుకోలేదు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఏ విధంగా బరితెగించాడో అర్థమవుతోంది" అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు.