Pawan Kalyan: డ్యాన్స్ లు వేసుకోవడానికా నీకు మంత్రి పదవి ఇచ్చింది?: పవన్ కల్యాణ్
- పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వారాహి సభ
- పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందన్న పవన్
- 2018 నాటికి టీడీపీ హయాంలో పోలవరం 50 శాతం పూర్తయిందని వెల్లడి
- జగన్ వచ్చాక పోలవరంపై కథలు చెబుతున్నాడని విమర్శలు
పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభ నిర్వహించారు. పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని తెలిపారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ముందుకు కదిలింది అంటే అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబమేనని, వారి కుటుంబం పోలవరం ప్రాజెక్టుకు 110 ఎకరాలు ఇచ్చేసిందని వెల్లడించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 నాటికి పోలవరం 50 శాతం పూర్తయిందని, కానీ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కథలు చెప్పాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. పునరావాస ప్యాకేజి అమలు చేస్తామని గిరిజనుల సహా అందరినీ నమ్మించాడని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు.
నేను కేంద్ర మంత్రులతో మాట్లాడాను... పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 1.60 లక్షల మంది నిర్వాసితులను ఆదుకునేందుకు రూ.30 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు అని వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇదే కష్టమైన పని... జగన్ దీన్నుంచి తప్పించుకోవడానికి ప్రాజెక్టును చంపేశాడు అని విమర్శించారు.
నేనొకసారి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో మాట్లాడాను... మీ పోలవరం ప్రాజెక్టు వైసీపీకి ఏటీఎమ్ లా అయిపోయిందని ఆయన అన్నారు. డబ్బులు కావాలంటే పోలవరంలో చిన్న పని మొదలుపెట్టు... నిధులు మంజూరు చేసుకో, డబ్బులు దోచుకో అన్నట్టు పరిస్థితి తయారైంది. ఇప్పుడు బాధపడుతుంది ఎవరు? రాష్ట్ర ప్రజలే కదా! అంటూ పవన్ ధ్వజమెత్తారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని పోలవరం పరిస్థితిపై అడిగితే నాకేం తెలుసు అంటాడు... అందుకా నీకు మంత్రి పదవి ఇచ్చింది? డ్యాన్స్ లు వేసుకోవడానికా? అంటూ మండిపడ్డారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన అనిల్ కుమార్ ను పోలవరం గురించి అడిగితే వెటకారంగా మాట్లాడతాడు... ఈ బఫూన్ రాంబాబును అడిగితే ఇంకో రకంగా సమాధానం చెబుతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు. మాట్లాడితే తండ్రి లేని బిడ్డనంటాడు... అసలు ఊళ్లే లేని బిడ్డలు రోడ్డు మీద లక్షా అరవై వేల మంది తిరుగుతుంటారు అంటూ ఎద్దేవా చేశారు.
కాగా, కొయ్యలగూడెం వారాహి విజయభేరి సభ సందర్భంగా పవన్ కల్యాణ్ పోలవరం నిర్వాసితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు.