Jagga Reddy: ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్!
- రాజస్థాన్‌లో మోదీ విద్వేషపూరిత ప్రసంగంపై ఈసీ నోటీసు ఇవ్వకపోవడంపై మండిపాటు
- ఎన్నికల కమిషన్ తీరు పారదర్శకంగా లేదంటూ విమర్శ
- బీజేపీ సర్కార్ ఎన్నికల కమిషన్‌ను ఇంటి నౌకరుగా భావిస్తోందన్న జగ్గారెడ్డి
ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈసీ డమ్మీగా మారిందన్నారు. ఇటీవల రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత ప్రసంగంపై ఎన్నికల కమిషన్ ఎందుకు నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈసీ తీరు పారదర్శకంగా లేదని విమర్శించారు.
మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు బొల్లు కిషన్, లోకేశ్ యాదవ్‌లతో కలిసి జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎన్ శేషన్ లాంటి అధికారులు ఈసీలో నిష్పక్షపాతంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ సర్కార్ ఎన్నికల కమిషన్‌ను ఇంటి నౌకరుగా భావిస్తోందని దుయ్యబట్టారు.
ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంపూర్ణ మద్దతు కాంగ్రెస్‌కు ఉందన్నారు. అందుకే ఓటమి భయంతో అమిత్‌షా ఫేక్ వీడియో వ్యవహారంలో ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్‌కు పంపించి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారంటూ ఫైర్ అయ్యారు. ఒక్క మహిళైనా తన తాళిబొట్టు కాంగ్రెస్ వాళ్లు లాక్కెళ్లారని ఫిర్యాదు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని తెలిపారు.
మరోవైపు మంగళవారం గాంధీభవన్ లో కోదండరెడ్డి, జగ్గారెడ్డిల సమక్షంలో ఆదిలాబాద్‌కు చెందిన మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి, గండ్ర సుజాత కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాకపోవడంతో వారు పార్టీని వీడారు. ఆ సమయంలో పార్టీ వారిపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, కాంగ్రెస్‌ను వీడిన వారు ఆసక్తి చూపిస్తే తిరిగి చేర్చుకోవాలని అధిష్ఠానం ఆదేశించడంతో వారు తిరిగి హస్తం గూటికి చేరారు. అటు వనపర్తికి చెందిన బీఆర్ఎస్ నేత శాంతయ్య తన అనుచరులతో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.