Vijayashanti: తగ్గేదేలే.. కేసీఆర్ కూడా రాజీనామాకు సిద్ధంగా ఉండాలి: విజయశాంతి
- ‘టీవీ 9‘ ఇంటర్వ్యూలో ‘ప్రజావాణి’పై కేసీఆర్ విమర్శలు
- ఆయన కోరుకున్నట్టుగానే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి సమాధానమిస్తుందన్న విజయశాంతి
- హరీశ్‌రావులానే కేసీఆర్ కూడా రాజీనామాకు సిద్ధపడాలన్న సీనియర్ నేత
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు సవాళ్లు స్వీకరించడం కొత్త కాదని, ఈ విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ‘టీవీ9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఓ క్లిప్పింగ్‌ను తన ఎక్స్‌ఖాతాలో షేర్ చేసిన విజయశాంతి.. రైతు రుణమాఫీ విషయంలో హరీశ్‌రావు సవాలును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వీకరించారని అలాగే, ‘ప్రజావాణి’ అంశంలో కేసీఆర్ సవాలును కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. ప్రజావాణి అంశం జనబాహుళ్యానికి చెందినదని పేర్కొన్నారు.
ప్రజావాణి అంశంపై కేసీఆర్ కోరుకున్నట్టుగానే శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు ఇంకా ఎన్నో సమస్యలకు ధైర్యంగా సమాధానాలు చెబుతుందని ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారని పేర్కొన్నారు. తన సవాలుపై హరీశ్‌రావు రాజీనామా ప్రకటించినట్టుగానే, ప్రజావాణిపై తన ఆరోపణలు తప్పని తేలితే గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి, బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.