may day: సోషల్ మీడియాలో తన ‘మే డే’ వీడియో పంచుకున్న మెగాస్టార్
- ‘ఎక్స్’ వేదికగా కార్మిక లోకానికి చిరంజీవి శుభాకాంక్షలు
- బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం 22 ఏళ్ల కిందట చేసిన వీడియో పోస్ట్ చేసిన మెగా బ్రదర్
- ఈ రోజుకీ ఆ యాడ్ సందర్భోచితం అనిపించి షేర్ చేస్తున్నట్లు వెల్లడి
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కార్మిక లోకానికి బుధవారం సోషల్ మీడియా వేదికగా మే డే శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ మే డే టు ఆల్ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా గతంలో తాను బాలకార్మికుల నిర్మూలన కోసం చేసిన ఒక ప్రచార వీడియో యాడ్ ను చిరంజీవి షేర్ చేశారు.
‘22 సంవత్సరాల క్రితం .. పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) కోసం "చిన్ని చేతులు" పేరుతో ప్రచారం చేపట్టా. ఈ రోజుకీ అది సందర్భోచితం అనిపించి షేర్ చేస్తున్నాను’ అని ఆ పోస్ట్ లో చిరంజీవి తెలిపారు. తన పోస్ట్ కు ఇంటర్నేషనల్ లేబర్ డే, మే డే అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు. షేర్ చేసిన కాసేపటికే ఈ వీడియోకు 53 వేల వ్యూస్ లభించాయి.
ఆ యాడ్ లో ఓ తల్లి తన కుమార్తెను ఎక్కాలు అప్పచెప్పించుకుంటుంటే పక్కనే ఓ పనిమనిషి తన కూతురుతో కలసి అంట్లు తోముతూ ఉంటుంది. ఆమె చేతిలోని గిన్నె పొరపాటున జారి పడటం వల్ల శబ్దం రావడంతో యజమానురాలు ఆమెపై కోప్పడుతుంది. చెయ్యి జారిందమ్మా అంటూ పనిమనిషి చెబితే ఊరుకుంటుంది. కానీ ఆ తర్వాత పనిమనిషి కూతురు చేతిలోని నీళ్ల బిందె జారిపడటంతో పెద్ద శబ్దం అవుతుంది. దీంతో కోపోద్రిక్తురాలైన యజమానురాలు తన పాప చదువుకుంటోంది.. బుద్ధి లేదా అంటూ తిడుతుంది. దీంతో ఆ పనిమనిషి దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది. తన లాగా కాకుండా తన కూతురు బాగా బతకాలని ఉందని మనసులో అనుకుంటుంది. కానీ ఇదంతా తన తలరాత అంటూ సరిపెట్టుకుంటుంది.
సరిగ్గా అప్పుడే చిరంజీవి మాటలు పనిమనిషికి వినిపిస్తాయి. ‘తలరాత అని తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. నువ్వూ మీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వొచ్చు. దానికి మార్గం ఆమెను చదివించడం ఒక్కటే. బడికి పంపించమ్మా.. పనికి కాదు’ అని చిరంజీవి సూచించగానే ఆ పనిమనిషి తన బిడ్డను ప్రభుత్వ బడికి పంపిస్తుంది. కూతురు స్కూల్లోకి పరుగెత్తుకుంటూ వెళ్తుంటే మురిపెంగా చూసి సంతోషపడుతుంది. లోపలకు వెళ్లే ముందు ఆ చిన్నారి టాటా చెబితే ఆ తల్లి కూడా చెయ్యి ఊపుతుంది. లోపలకు వెళ్లిన పాప బోర్డ్ పై పని పిల్లలు అని తెలుగులో రాసి ఉన్న అక్షరాలను కాస్తా పసి పిల్లలుగా మార్చి దిద్దడంతో ఆ యాడ్ ముగుస్తుంది. పిల్లలు పని విడిచిపెట్టి, పుస్తకం పట్టాలని యాడ్ సూచిస్తుంది.