Venu: మా నాన్న విషయంలో నాకు కలిగిన బాధనే 'బలగం': డైరెక్టర్ వేణు
- సినిమాల్లో సరైన బ్రేక్ రాలేదన్న వేణు
- ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డానని వెల్లడి
- 110 సినిమా తరువాత 'జబర్దస్త్'కి వెళ్లానని వివరణ
- తనకి ఎదురైన అనుభవమే కథగా మారిందని వ్యాఖ్య
ఆ మధ్య వచ్చిన 'బలగం' సినిమా ఒక సంచలనాన్ని సృష్టించింది. పాత కాలం నాటి రోజులను గుర్తుచేస్తూ, ఊళ్లో వాళ్లంతా కలిసి చూసిన సినిమా ఇది. అలాంటి ఆ సినిమాకి దర్శకత్వం వహించిన వేణుని ప్రశంసించనివారు లేరు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న వేణు, ఈ సినిమాను గురించిన విషయాలను ఈ వేదిక ద్వారా పంచుకున్నాడు.
"నేను 110 సినిమాలు చేసిన తరువాత 'జబర్దస్త్'కి వెళ్లాను. కానీ మనసు మళ్లీ సినిమా వైపుకు లాగడంతో అటువైపు వెళ్లాను. సీరియల్స్ చేస్తున్నాడని సినిమా వాళ్లు పిలవడం మానేశారు. సినిమాలే చేస్తాడట అనేసి సీరియల్స్ వైపు నుంచి అవకాశాలు రాలేదు. ఆ సమయంలో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను" అని అన్నాడు.
"గతంలో నేను కొన్ని సినిమాలకు రైటర్ గా కూడా చేశాను .. ట్రాక్స్ రాశాను. అలా నా కోసం ఎందుకు రాసుకోకూడదని చెప్పి, నేను ప్రధాన పాత్రగా అనుకుని 'బలగం' రాసుకున్నాను. మా నాన్న విషయంలో నాకు ఎదురైన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుని, ఆ బాధను కాగితంపై పెట్టాను. అలా ఆ కథ పెరుగుతూ వెళ్లింది. జనంలో నుంచి పుట్టిన కథ కావడం వలన, చాలా వేగంగా కనెక్ట్ అయింది" అని చెప్పాడు.