Artificial Intelligence: జపాన్ లో ఎలుగుబంట్ల దాడులకు ఏఐ చెక్!
- సీసీటీవీల నెట్ వర్క్ ద్వారా రియల్ టైం లో ఎలుగుబంట్ల కదలికలను గుర్తించనున్న ఏఐ అల్గోరిథమ్ లు
- ఆ సమాచారం ఆధారంగా అధికారులను ముందే అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు
- త్వరలో టొయోమా ప్రిఫెక్చర్ లో పైలట్ ప్రాజెక్టు అమలు
- విజయవంతమైతే దేశవ్యాప్తంగా వాడుకలోకి ఏఐ డిటెక్షన్ సిస్టం
- జపాన్ లో 50 వేలకుపైగా ఎలుగుబంట్ల జీవనం
జపాన్ లో కొంతకాలంగా మనుషులపై ఎలుగుబంట్ల దాడులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం వినూత్న పరిష్కారాల దిశగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే డిటెక్షన్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తోంది. ఎలుగుబంట్ల రాకను ముందే పసిగట్టి అప్రమత్తం చేసే విధానాన్ని తయారు చేస్తోంది. ఈ వేసవి నెలల్లో టొయోమా ప్రిఫెక్చర్ లో ఎలుగుబంట్ల దాడులు జరిగే ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ఏఐ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఏఐ అల్గోరిథమ్ లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు నెట్ వర్క్ లకు చెందిన సీసీ కెమెరాలను రియల్ టైం లో ఎలుగుబంట్ల కదలికలను గుర్తిస్తాయి. ఆపై సంబంధిత అధికారులను వెంటనే అప్రమత్తం చేస్తాయి. దీనివల్ల ముందుగానే దాడులను నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయనున్నారు.
జపాన్ లో గత ఏడాది వ్యవధిలో ఏకంగా 198 సార్లు ఎలుగుబంట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆరుగురు మరణించగా మరో 219 మంది గాయపడ్డారు. దీంతో ప్రజా భద్రతపై అందరిలోనూ ఆందోళన మొదలైంది.
ఎలుగుబంట్ల ఆహార వనరులు తగ్గిపోవడం, పంటల దిగుబడి క్షీణించడం, అడవుల ఆక్రమణ వంటి కారణాల వల్ల జపాన్ వాసులపై ఎలుగుబంట్ల దాడులు పెరుగుతున్నాయి. ఎలుగుబంట్లు ఇష్టంగా తినే ఆహారాలు లభించకపోవడం, గ్రామీణ జనాభా తగ్గడం ఈ దాడులకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు.
ఎలుగుబంట్లు కనిపించడాన్ని జపాన్ భాషలో కుమాగా పిలుస్తారు. దేశంలోని పర్వత శ్రేణులు, అడవులు, నదుల ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఎక్కువగా జీవిస్తుంటాయి. జపాన్ లో సుమారు 44,000 నల్ల ఎలుగులు ఉన్నట్లు అంచనా. 2012లో వాటి సంఖ్య సుమారు 15,000 గా ఉండేది. నల్ల ఎలుగులు కాకుండా హొక్కాయ్ డో అనే ప్రాంతంలో ఉండే సుమారు 12,000 ఉస్సూరి జాతి బ్రౌన్ బేర్లు కూడా ఉన్నాయి.