Mallikarjun Kharge: ముస్లింలకు మాత్రమే ఎక్కువ మంది పిల్లలు ఉంటారా.. ? మోదీని నిలదీసిన ఖర్గే

Do Only Muslims Have More Children Mallikarjun Kharge Counters PM Modi

  • ముస్లింలు కూడా భారతదేశ పౌరులేనని వ్యాఖ్య
  • తనకూ ఐదుగురు పిల్లలని వెల్లడించిన కాంగ్రెస్ చీఫ్
  • రెండు దశల పోలింగ్ పూర్తయ్యాక మోదీకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా

దేశంలో పిల్లలు ఎక్కువగా ఉండేది కేవలం ముస్లింలకు మాత్రమే కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తన తండ్రికి తానొక్కడినే కానీ తనకు ఐదుగురు పిల్లలని గుర్తుచేశారు. ఈమేరకు ఛత్తీస్ గఢ్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ ముస్లింలు కూడా భారతదేశ పౌరులేనని, అందరమూ భారతీయులమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలలో రెండు ఫేజ్ లు ఇప్పటికే పూర్తయిన విషయం గుర్తుచేస్తూ.. పోలింగ్ సరళిని చూశాక కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రాబోతోందని మోదీకి తెలిసిపోయిందన్నారు. దీంతో ఫ్రస్ట్రేషన్ కు గురై మంగళసూత్రాలు, ముస్లింలు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని తేలిపోవడంతో మోదీ సహా బీజేపీ నేతల్లో భయాందోళన మొదలైందన్నారు.

బీజేపీ స్లోగన్ ‘అబ్ కీ బార్ 400 కే పార్’ పైనా ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ, నడ్డా, అమిత్ షా.. ఇలా బీజేపీ నేతలంతా ఈసారి ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారని గుర్తుచేశారు. పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజారిటీ ఇవ్వాలని అడుగుతున్నారు.. ఎందుకివ్వాలని ఖర్గే ప్రశ్నించారు. రాజ్యాంగం పేదలకు కల్పించిన రిజర్వేషన్లను ఎత్తేయడానికే వారికి 400 సీట్లు కావాలట అంటూ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అసలు ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఖర్గే నిలదీశారు. రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ ఎక్కడో ఎవరితోనో ఆయనే అని ఉంటారని, రద్దు విషయమై చర్చించి ఉంటారని ఆరోపించారు. అందుకే రిజర్వేషన్ల రద్దు విషయం ప్రచారంలోకి వచ్చిందన్నారు. తొలి రెండు దశల పోలింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోయిందన్నారు.

  • Loading...

More Telugu News