IYR Krishna Rao: ఇది అమలు చేయడానికి సాధ్యం కాని మేనిఫెస్టో: 'కూటమి' మేనిఫెస్టోపై ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్య
- ఇది టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే ప్రజల్లోకి వెళుతుందన్న ఐవైఆర్
- బీజేపీ అంటీముట్టనట్టుగానే ఉందని వెల్లడి
- ఒక రకంగా ఇది ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని వివరణ
నిన్న బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. దీన్ని ఉమ్మడి మేనిఫెస్టో అనలేమని అభిప్రాయపడ్డారు. ఒక రకంగా ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని అభివర్ణించారు. ఈ మేనిఫెస్టోతో బీజేపీ అంటీముట్టనట్టుగా ఉందని తెలిపారు.
ఇది అమలు చేయడానికి సాధ్యం కాని మేనిఫెస్టో అని ఐవైఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న చాలా అంశాల్లో స్పష్టత లేదని అన్నారు. టీడీపీ, జనసేన ఇచ్చిన హామీలకు, బీజేపీ విధానాలకు సారూప్యత కుదరడం లేదని స్పష్టం చేశారు. అనేక అంశాల్లో బీజేపీ జాతీయ విధానం అవలంబిస్తోందని, అందుకే ఏపీలో మేనిఫెస్టోకు దూరంగా ఉంటామన్న వైఖరిని బీజేపీ కనబర్చిందని వివరించారు.
ఆ మేనిఫెస్టోను ప్రధానంగా టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే భావిస్తారని ఐవైఆర్ తెలిపారు. ఆ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుంది అనేది పార్టీ మాట అని అన్నారు.