Revanth Reddy: ఆ అంశంపై ప్రశ్నించినందుకు నాపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారు: రేవంత్ రెడ్డి
- ఢిల్లీ పోలీసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం
- మోదీ వద్ద సీబీఐ, ఈడీ ఉంటే తన వెంట 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారని వ్యాఖ్య
- కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్న ముఖ్యమంత్రి
రిజర్వేషన్లపై తాను ప్రశ్నించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు... ఢిల్లీ పోలీసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. కేసీఆర్ తనను చర్లపల్లి జైలుకు పంపిస్తే కొట్లాడామని, మోదీ దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండవచ్చు.. కానీ తన వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. బలహీనవర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు అందలేదన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు గతం కంటే భిన్నమైనవన్నారు.
రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలిచి దేశాన్ని అమ్మేయాలని బీజేపీ చూస్తోందన్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఇదే అంశాన్ని తాను ప్రశ్నించినందుకు పోలీసులతో నోటీసులు ఇప్పించారన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారని... శపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లయినా ఇవ్వలేదని విమర్శించారు.