Chandrababu: అమరావతి లేకపోతే ఏంటి నష్టం అనుకుంటున్నారా?: చంద్రబాబు
- బాపట్ల జిల్లా చీరాలలో ప్రజాగళం సభ
- అమరావతి విశిష్టతను వివరించిన చంద్రబాబు
- రాజధాని పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన
- జగన్ చేసిన వాటిలో మంచి పనులు ఉంటే కొనసాగిస్తామని స్పష్టీకరణ
బాపట్ల జిల్లా చీరాలలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అవసరాన్ని నొక్కి చెప్పారు.
"అమరావతి లేకపోతే నష్టం ఏంటి అనుకుంటున్నారా? అమరావతి పూర్తయి ఉంటే ఒకటిన్నర గంటలో అమరావతి వెళ్లి పనిచూసుకుని సాయంత్రానికి తిరిగొచ్చే వీలుండేది. మన పిల్లల చదువు కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం అమరావతి ఒక కేంద్రంగా ఉండేది. సంపద సృష్టించడానికి ఒక కేంద్రంగా ఉండేది. సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని పెంచే ఒక కేంద్రంగా ఉండేది.
చీరాల, బాపట్లలో పని దొరక్కపోతే హైదరాబాద్ కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్లే ఖర్మ పట్టింది. ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతోంది. ఎవరన్నా మీ రాజధాని ఏదంటే, రాజధాని పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో తెలుగుజాతి ఉంది.
పట్టిసీమ ప్రాజెక్టు నేను ప్రారంభించానని, నేను నిర్మించానని, ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఉపయోగించుకోని దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి కొన్ని పనులు చేశాడు... వాటిలో కొన్ని చెడ్డపనులు ఉన్నాయి... వాటిని సరిదిద్దుతాం. అతడు చేసిన వాటిలో కొన్ని మంచి పనులు ఉంటే నేను అవి కూడా కొనసాగిస్తానే తప్ప, ఒక సైకో చేశాడని అతడి లాగా నేను విధ్వంసం చేయను.
అందరూ మే 13వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలంతా కూటమి అభ్యర్థుల గుర్తులపై ఓటు వేసి గెలిపించాలి. బాపట్ల ఎంపీ అభ్యర్థి టీడీపీ నాయకుడే... ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారు. పోయినసారి కూడా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు... ఈసారి నాకు అనుమానమే లేదు... ఏడుకు ఏడు మనం గెలుస్తున్నాం... స్వేచ్ఛగా, ఆలోచించి, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి.
నిన్న మేనిఫెస్టో విడుదల చేశాం. దేశంలోనే తొలిసారిగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి పిల్లలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. మేం అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. పెంచిన పెన్షన్ ను ఏప్రిల్ నుంచే వర్తించేలా ఇస్తాం. అతడు (జగన్) కూడా పెన్షన్ పెంచుతానంటున్నాడు. 2028కి రూ.250 పెంచుతాడట, 2029కి మరో రూ.250 పెంచుతాడట.
నేను అలా చెప్పడంలేదు... ఏప్రిల్ నుంచే పెంచుతాం... దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తాం. పూర్తిగా కాళ్లు, చేతులు లేని వారికి నెలకు రూ.15 వేలు ఇస్తాం. కొందరు కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ.10 వేలు ఇస్తాం. మళ్లీ చంద్రన్న బీమా తీసుకువస్తాం... సహజంగా చనిపోతే రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఇచ్చే బాధ్యత మాది.
ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తాం. డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం, మండల కేంద్రాల్లో జనరిక్ ఔషధాల దుకాణాలు తెరుస్తాం. బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులు సరఫరా చేస్తాం" అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.