Chandrababu: ఎక్కడున్నాడు ఆ పెద్ద మనిషి?: కరణం బలరాంపై చంద్రబాబు ఫైర్
- చీరాలలో ప్రజాగళం సభ
- పనుల కోసం కక్కుర్తిపడి పార్టీలు మారే నేతలు అంటూ బలరాంపై చంద్రబాబు ఆగ్రహం
- మళ్లీ పార్టీలోకి వస్తాం... గెలిపించమంటున్నాడని వెల్లడి
- ఇలాంటి వ్యక్తిని తాను దగ్గరికి కూడా రానివ్వనని చంద్రబాబు స్పష్టీకరణ
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి, వైసీపీలోకి వెళ్లిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. "ఈ నియోజకవర్గంలో 2019లో టీడీపీపై అభిమానంతో ఏకపక్షంగా ఓట్లేసి అతడిని గెలిపించారు... ఇప్పుడా పెద్దమనిషి ఎక్కడున్నాడు? పనుల కోసం కక్కుర్తిపడే వాళ్లు రాజకీయాలకు అవసరమా? వీళ్లు నాయకులా?
ఇక్కడ గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు ఉన్నారు. ఏం, వాళ్లకు ఇబ్బందులు లేవా? వాళ్లు అడ్డదారులు తొక్కలేదే? పారిపోలేదే? నువ్వు వెళ్లాలి అనుకున్నప్పుడు రాజీనామా చేసి వెళ్లాలి. కానీ, ఇక్కడ గెలిచి అడ్డదారులు తొక్కి వెళ్లిపోయి, ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వస్తాం... ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నారు.
ఇలాంటి వ్యక్తులకు చీరాల ప్రజలు గుణపాఠం చెప్పాలి. ఆయా రాం గయా రాం తరహా వ్యక్తులు మనకు అవసరం లేదు. నిక్కచ్చిగా నిలబడే బంగారం వంటి నేతలు నా వద్ద ఉన్నారు. నష్టాలను, కష్టాలను అనుభవించారు. వాళ్లతోనే ముందుకు వెళతాను తప్ప, ఇలాంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు కూడా రానివ్వను.
ఇంకొకాయన (ఆమంచి) ఉన్నాడు... నేను ఎమ్మెల్యేగా వచ్చి పార్టీలో చేరతానని అడుక్కుంటే పార్టీలో చేర్చుకున్నాం. కానీ, అతడు అన్ని పనులు చక్కబెట్టుకుని గత ఎన్నికల ముందు పారిపోయాడు. ఇవి అవకాశవాద రాజకీయాలు. ఇక్కడ రౌడీయిజం చేసి భయపెట్టి రాజకీయాలు చేయొచ్చనుకుంటున్నారు... కానీ, ఇది జరగని పని" అని చంద్రబాబు స్పష్టం చేశారు.