KCR: తన ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై స్పందించిన కేసీఆర్
- కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీ
- తన మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదన్న కేసీఆర్
- స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదని వ్యాఖ్య
- కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే తాను ప్రశ్నించానన్న కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ అంశంపై కేసీఆర్ స్పందించారు. తన మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరిగా లేదన్నారు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే తాను ప్రశ్నించానన్నారు.
తెలంగాణ గొంతుపై నిషేధమా?
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదెక్కడి అరాచకం...? ఏకంగా తెలంగాణ గొంతు పైనే నిషేధమా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా..? ఆయనపై వేలాది ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా...? అలాంటి 'చీప్' మినిస్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. బడే భాయ్.. చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది...! అని నిలదీశారు. కేసీఆర్ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు వణికిపోతున్నాయన్నారు. ఆ పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యులర్‌ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఈ అంశంపై రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ తెలిపింది. సీఎం రేవంత్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.