IPL 2024: చెన్నై బ్యాటింగ్ లైనప్ కు కళ్లెం వేసిన పంజాబ్ కింగ్స్
- చెన్నై సూపర్ కింగ్స్ × పంజాబ్ కింగ్స్
- ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసిన చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ ను వారి సొంతగడ్డపై కట్టడి చేయడం అంటే మాటలు కాదు. కానీ, ఇవాళ పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మన్లకు కళ్లెం వేశారు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేశాడు. గైక్వాడ్ క్రీజులో ఉన్నంత సేపు పరుగులు పెట్టిన చెన్నై స్కోరు... అతడు అవుట్ కాగానే నెమ్మదించింది.
ఇటీవల తీవ్రంగా నిరాశ పరుస్తూ తక్కువ స్కోర్లకే అవుటవుతున్న ఓపెనర్ అజింక్యా రహానే... ఇవాళ 29 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు ఎంపికైన శివమ్ దూబే (0) ఆడిన తొలి బంతికే డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా (2) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు.
సమీర్ రిజ్వీ 21, మొయిన్ అలీ 15, ధోనీ 14 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ 2, రాహుల్ చహర్ 2, కగిసో రబాడా 1, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు.