hindu marriage act: సంప్రదాయ ఆచారాలు పాటించకుండా జరిగే హిందూ వివాహం చెల్లదు: సుప్రీంకోర్టు
- పెళ్లి ఆటపాటల కార్యక్రమమో, కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకొనే వాణిజ్య లావాదేవీనో కాదని వ్యాఖ్య
- హిందూ ధర్మంలో పెళ్లికి పవిత్రత ఉందని.. దానికి ఆ హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
- హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి తంతు లేకుండా ఒక్కటైన దంపతులు విడాకుల కోసం వేసిన పిటిషన్ డిస్మిస్
హిందూ వివాహం ఓ పవిత్రమైన కార్యక్రమమే తప్ప ఆటపాటల కార్యక్రమమో, విందు వినోదమో లేదా వాణిజ్య లావాదేవీనో కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం పెళ్లిలో కచ్చితంగా సంప్రదాయ ఆచారాలు, క్రతువులను నిర్వహించాల్సిందేనని పేర్కొంది. అలాంటి ప్రక్రియలను పాటించకుండా జరిగిన పెళ్లిని రిజిస్టర్ చేసినా దాన్ని చట్టబద్ధంగా చెల్లదని ప్రకటించాల్సి వస్తుందని వెల్లడించింది.
‘హిందూ ధర్మంలో పెళ్లి అనేది ఒక సంస్కారం. దానికి పవిత్రత ఉంది. భారతీయ సమాజంలో దానికి ఆ హోదా ఇవ్వాల్సిందే’ అని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మాసిహ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
‘పెళ్లికి ముందే యువతీ యువకులు హిందూ వివాహ వ్యవస్థ గురించి లోతుగా ఆలోచించుకోవాలి. అది ఎంత పవిత్రమైనదో అర్థం చేసుకోవాలి. పెళ్లి అనేది కేవలం కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకొనే వాణిజ్య లావీదేవీ కాదు. భారతీయ సమాజంలో పెళ్లి అనేది ఆడ, మగ మధ్య భార్యాభర్తల బంధం కోసం, భవిష్యత్తులో ఏర్పడే కుటుంబం కోసం నిర్వహించే కార్యక్రమం’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పెళ్లిలో భార్యాభర్తలుగా ఒక్కటయ్యే దంపతులు ఏడడుగులు వేసే సప్తపది లాంటి సంప్రదాయ ఆచారాలను నిర్వహించకపోతే అది హిందూ వివాహం కాదని కోర్టు స్పష్టం చేసింది.
హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి తంతును అనుసరించకుండానే ఒక్కటైన ఓ జంట తమకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ ఆ దంపతుల పెళ్లి చెల్లదని ఇటీవల తీర్పు వెలువరించింది. అలాగే వారి విడాకుల పిటిషన్ ను డిస్మిస్ చేసింది.