Nara Lokesh: విద్యార్థులకు ఇబ్బంది లేని పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెస్తాం: నారా లోకేశ్
- జగన్ విధానాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్న లోకేశ్
- గత ప్రభుత్వాలు డబ్బులను కాలేజీ అకౌంట్లలోకి వేసేవన్న లోకేశ్
- పాత విధానాన్ని అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని వ్యాఖ్య
విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను తీసుకొచ్చి విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ చాలా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. గతంలో ప్రభుత్వాలు డబ్బులను నేరుగా కాలేజీ అకౌంట్లలో వేసేవని... అప్పుడు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని అన్నారు. జగన్ కావాలనే కొత్త విధానాలను తీసుకురావడంతో... విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు బస్ డ్రైవర్ ఒకరు తనను కలిశారని... రూ. 1.80 వేలు కాలేజీకి కట్టి తన కూతురు సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నానని... తన మాదిరే ఎందరో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని... ఫీజు రీయింబర్స్ మెంట్ పాత విధానాన్నే అమలు చేయాలని తనను కోరారని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా దాన్ని పెట్టామని... ఫీజు రీయింబర్స్ మెంట్ పాత విధానాన్ని అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేని పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.