Kommareddy Pattabhi Ram: వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్ల అవినీతి: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
- అవినీతికి చెక్ పెడితే సంక్షేమ కార్యక్రమాలను చాలా ఈజీగా అమలు చేయొచ్చన్న టీడీపీ నేత
- కూటమి మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టీకరణ
- చిల్లర రాజకీయాలు చేయడంలో జగన్ ముఠా సిద్ధహస్తులన్న బీజేపీ నేత లంకా దినకర్
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ, జనసేన నేతలతో కలిసి ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పట్టాభిరామ్ మాట్లాడుతూ.. అవినీతికి చెక్ పెడితే సంక్షేమ కార్యక్రమాలను చాలా ఈజీగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని అరికట్టడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని అన్నారు. అలాగే కూటమి మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ జాతీయ శక్తి.. టీడీపీ-జనసేన ప్రాంతీయ శక్తి: లంకా దినకర్
టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలను.. బీజేపీ మేనిఫెస్టో జాతీయ ఆకాంక్షలను నెరవేరుస్తాయని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. బీజేపీ జాతీయ శక్తి.. టీడీపీ-జనసేన ప్రాంతీయ శక్తి. రెండు శక్తుల కలయిక అనేది దేశ, రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అని అన్నారు. దేశం, రాష్ట్రం రెండు కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. చిల్లర రాజకీయాలు చేయడంలో జగన్ ముఠా సిద్ధహస్తులని దినకర్ విమర్శించారు. చివరికి శ్మశానంలో శిలాఫలకాపై కూడా బొమ్మలు వేసుకోవాలనే మానసిక స్థితికి ముఖ్యమంత్రి దిగజారిపోయారని దుయ్యబట్టారు.