Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్రం... చంద్రబాబు ప్రశ్నించాల్సింది బీజేపీని: సజ్జల
- ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
- భూములపై ప్రజలు హక్కులు కోల్పోతారంటున్న విపక్ష నేతలు
- వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సజ్జల ఆగ్రహం
ఏపీలో గత కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (ఎల్టీయే)పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తమ సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ చట్టంతో ప్రజలు భూములపై హక్కులు కోల్పోతారని వారు ప్రచారం చేస్తుండగా.... సీఎం జగన్ సహా, ఇతర వైసీపీ నేతలందరూ సదరు చట్టంపై వివరణలు ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఏళ్ల తరబడిగా రైతులు, భూమి సొంతదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని తీసుకువచ్చింది కేంద్రం అని, చంద్రబాబు ప్రశ్నించాలనుకుంటే బీజేపీని ప్రశ్నించాలని సజ్జల పేర్కొన్నారు.
కానీ రాజకీయ కుతంత్రాల్లో భాగంగానే వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ స్పందించాలని సజ్జల డిమాండ్ చేశారు.