Japan: అందమైన అమ్మాయిల చంకలోని చెమటతో డిష్.. రేటు అదరహో!
- ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న జపనీస్ స్నాక్
- లొట్టలేసుకొని తింటున్న కస్టమర్లు
- మండిపడుతున్న నెటిజన్లు
పాత ఒక రోత.. కొత్త ఒక వింత అనే నానుడి తెలిసిందేగా.. జపాన్ లోని రెస్టారెంట్లు కూడా ప్రస్తుతం అచ్చం దీన్నే ఫాలో అవుతున్నాయి. శతాబ్దాల చరిత్రగల తమ దేశ పురాతన వంటకాన్ని వెరైటీగా సిద్ధం చేసి భారీ ధరలకు కస్టమర్లకు అందిస్తున్నాయి. కానీ ఆ స్నాక్ తయారీ విధానం మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది! కొందరు పాజిటివ్ గా తీసుకుంటే మరికొందరు నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద ఆ వంటకం తయారీ విధానం జపాన్ ఆహార సంస్కృతిపై సోషల్ మీడియాలో రచ్చకు దారితీస్తోంది!
ఇంతకీ విషయం ఏమిటంటే.. జపాన్ లో ఒనిగిరి (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసాన్ని, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. దాన్ని గుండ్రటి ముద్దలుగా లేదా త్రికోణం ఆకారంలోకి మార్చి అమ్ముతుంటారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తో చుడతారు. కానీ కొంతకాలంగా రెస్టారెంట్ల నిర్వాహకులు కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. అందమైన మహిళా చెఫ్ లను రంగంలోకి దించారు. వాళ్ళు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడుతున్నారు! అలా చుట్టిన ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం పాత తయారీ విధానంతో పోలిస్తే వీటి రుచిలో పెద్దగా తేడా రాలేదని అంటున్నారు.
ఇలా తయారు చేస్తారు..
ఒనిగిరి రైస్ బాల్స్ సిద్ధం చేసే ముందు చెఫ్ లు తమ చేతులు, చంకలను డిస్ ఇన్ఫెక్టంట్ తో శుభ్రం చేసుకుంటారు. ఆ తర్వాత వారు చెమట పట్టేలా ఎక్సర్ సైజులు చేస్తారు. అనంతరం ఉడికించిన కూరగాయలు, మాంసంతో కలిపిన అన్నాన్ని బాగా చెమట పట్టిన చంకలో పెట్టుకొని తగిన షేప్ లోకి తీసుకొస్తారు! ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేట్లలో కస్టమర్లకు వడ్డిస్తారు! కొన్ని రెస్టారెంట్లు అయితే కస్టమర్లను కిచెన్ లోకి ఆహ్వానిస్తున్నాయి. చెఫ్ లు ఆ డిష్ ను తయారు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కల్పిస్తున్నాయి.
కారణం ఉందట..
2013లో చేపట్టిన ఓ అధ్యయనం ప్రకారం.. చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దాన్ని వాసన చూసినా లేదా నాకినా అది లైంగిక ఆకర్షణలు పెంచుతుందట. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. అయితే ఈ వంటకం తయారీపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చర్మ వ్యాధులు లేని అందమైన యువతులు తయారు చేసిన ఒనిగిరి రైస్ బాల్స్ ను తినడానికి తమకేమీ అభ్యంతరం లేదని కొందరు చెప్పగా, మరికొందరు మాత్రం ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండిపడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్ ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.