Kesineni Chinni: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం.. బాబు వస్తేనే ఉద్యోగాలు: కేశినేని చిన్ని
- జగన్ పాలనలో యువత జీవితాలు నాశనమయ్యాయని కేశినేని చిన్ని విమర్శ
- కొందరు గంజాయికి కూడా అలవాటు పడ్డారని ఆవేదన
- ఉద్యోగాల కల్పనపై లోకేశ్ కార్యాచరణ సిద్ధం చేశారని వెల్లడి
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉద్యోగాలు లేక యువత జీవితాలు సర్వనాశనమైపోయాయని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారని అన్నారు. కొంతమంది తీవ్ర నిరాశలో గంజాయికి అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంపై నారా లోకేశ్ ఒక కార్యాచరణ సిద్ధం చేశారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణ చేపట్టి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పన గురించి ఎన్నారై వింగ్ తరపున కూడా దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి, ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని చెప్పారు.