Chandrababu: రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డికి సరైన మొగుడు దొరికాడు: చంద్రబాబు
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజాగళం సభ
- వైసీపీ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్న చంద్రబాబు
- ఈ నెల 13వ తేదీ మార్పునకు నాంది, గెలుపునకు పునాది అంటూ వ్యాఖ్యలు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కూటమి అభ్యర్థి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో రాజంపేట వైసీపీ ఎంపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమైందని అన్నారు. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఎగిరెగిరి పడ్డాడు కానీ, సరైన మొగుడు దొరికాడు అంటూ పక్కనే ఉన్న రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భుజం తట్టారు. శ్రీకాంత్ రెడ్డికి రాంప్రసాద్ రెడ్డి సరైన ప్రత్యర్థి అని అభివర్ణించారు. ఈ నెల 13వ తారీఖు మార్పుకు నాంది, గెలుపునకు పునాది అని అన్నారు.
"సైకో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు... రాయచోటికి ఏమైనా పనులు చేశాడా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని, కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తి చేశాడా? కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేశారు. ఆయన కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన గెలిస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది.
సీఎం సొంత జిల్లాలోనే కరవు ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అధికారులు వెళ్లి... జిల్లాలో కరవు ఉంది సార్ అంటే... మీ మొహం... నా జిల్లాలో కరవు ఎక్కడుంది? అని చెప్పిన సిగ్గులేని ముఖ్యమంత్రి, ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి.
జగన్ మోహన్ రెడ్డి 99 శాతం మేనిఫెస్టో అమలు చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ, 99 శాతం అమలు చేయలేదు. మేనిఫెస్టో అమలులో అతడికి గుండు సున్నా మార్కులు. ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా, ప్రజల ఆదాయం ఏమైనా పెరిగిందా? ఇంకెందుకీ చేతకాని ప్రభుత్వం? ఇది ఒక కోతల ప్రభుత్వం.
పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంటు చార్జీలు పెరిగాయి. మద్యం ఆదాయంలో అధికభాగం ఆయనకే వెళుతోంది... ఏ కొద్దిమొత్తంలోనూ ఖజానాకు చేరుతోంది. ప్రజలు ఆనందంగా ఉన్నారని ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడు. ఈ రాయచోటి నుంచి ముఖ్యమంత్రిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓటు అడుగుతానన్నాడా, లేదా? మాట నిలబెట్టుకోకుండా, ఓటు అడిగే హక్కు నీకు లేదు.
వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడా, లేదా? పీఆర్సీ అమలు చేస్తానన్నాడా, లేదా? మధ్యంతర ఊరట కలిగిస్తానన్నాడా, లేదా? ఆ హామీ ఇచ్చి ఇప్పటికి ఎన్ని వారాలు గడిచిపోయాయో! జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడా, లేదా? డీఎస్సీ పెడతానన్నాడా, లేదా? మళ్లీ జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి. రాష్ట్రాన్ని గంజాయి మయం చేసిన దుర్మార్గుడు ఈ జగన్.
జర్నలిస్టులకు, ఉద్యోగస్తులకు ఇళ్లు కట్టిస్తానన్నాడు... కట్టించాడా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం పనుల్లో 50 శాతం రిజర్వేషన్ అన్నాడు... ఇచ్చాడా? ఇలాంటి అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి.
కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, నేను ఉన్నాను... మేం గతంలో ముఖ్యమంత్రులుగా చేసినప్పుడు ఏనాడైనా పట్టాదారు పాస్ పుస్తకాలపై మా బొమ్మ వేసుకున్నామా? ఆ భూములు ఎవరివి? జగన్ మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా? కానీ ఈ ముఖ్యమంత్రి పట్టాదారు పాస్ పుస్తకంపై తన ఫొటో వేసుకున్నాడు. ఈయనేమైనా మీ ఇంటి పెద్దా? మీ తండ్రికి వారసుడా? మీ తాతకు వారసుడా?
వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి వచ్చినప్పుడు అడగండి... ఆస్తి మాదా, ముఖ్యమంత్రిదా అని నిలదీయండి. ఇప్పుడు మీ భూమిపై కన్ను పడింది. కొత్త చట్టం తెస్తున్నాడు... దీనిపేరు జగన్ గ్రాబింగ్ యాక్ట్. ఈ చట్టం వస్తే మీ భూమి మీది కాదు. అన్నీ కంప్యూటర్ లో ఉంటాయి...జిరాక్స్ కాపీలు ఇస్తాడంట. మీకు ఇలాంటి జిరాక్స్ కాపీలు ఇస్తే తగలబెట్టండి. మేం అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేస్తాం... మీ ఆస్తి మీకే ఇస్తాం.
నిన్న మొన్నా మహత్తర కార్యక్రమం చేశాడంట... సైకో జగన్ నోట్లో వేలుపెడితే కొరకడంట. ఇక్కడొక అవినాశ్ రెడ్డి ఉన్నాడు. హూ కిల్డ్ బాబాయ్? అందరికీ తెలుసు. పక్కనే నిందితుడ్ని పెట్టుకుని 'పాపం పిల్లవాడు అవినాశ్ రెడ్డి' అంటున్నాడు. పిల్లవాడు అయితే పలక, బలపం ఇచ్చి బడికి పంపించాలి గానీ పార్లమెంటుకు పంపిస్తావా జగన్ రెడ్డీ!" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.