Harish Rao: గుంపుమేస్త్రీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది... శిక్ష పడాల్సిందే: హరీశ్ రావు
- రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపణ
- ముఖ్యమంత్రికి అహంకారం వచ్చిందని మండిపాటు
- ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాంటి మాటలు మాట్లాడుతారా? అని నిలదీత
గుంపుమేస్త్రీ బాండ్ పేపర్ బౌన్స్ అయిందని, వారికి శిక్ష పడాల్సిందేనని... అందుకే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. ఆయనకు అహంకారం వచ్చిందని మండిపడ్డారు. నర్సాపూర్ నియోజకవర్గం దౌల్తాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజల తరుపున కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తుంటే... చెడ్డి ఊడగొడుతానని ముఖ్యమంత్రి అంటున్నారని... కానీ ఆ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతారా? అని నిలదీశారు.
పంట కొనుగోలు ఎందుకు చెయ్యడం లేదు? రైతుల జీవితాలతో ప్రభుత్వం ఎందుకు ఆడుకుంటోంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారును గెలిపించాలన్నారు. గుంపు మేస్త్రి గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? రైతులను రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారా? లేక చెప్పుతో రైతులను కొడుతా అన్నందుకు కాంగ్రెస్‌లో చేరారా? అని నిలదీశారు. కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టడం న్యాయమా? అని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆయనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మోసం చేసి వెళ్లాడన్నారు.
ఇవి కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కాదని... తెలంగాణ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని... కానీ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదని... రైతుబంధు ఊసే లేదని, కల్యాణలక్ష్మి ఇవ్వడం లేదని, తులం బంగారం ఇవ్వడం లేదని, రూ.4 వేల పెన్షన్లు అమలు చేయడం లేదని, పంటకు బోనస్ లేనే లేదన్నారు.