Ramappa Timmapur: ఎంపీ రేవణ్ణను శ్రీకృష్ణుడితో పోల్చుతూ కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
- ఎన్నికల ప్రచారంలో కర్ణాటక మంత్రి రామప్ప తిమ్మాపూర్ షాకింగ్ కామెంట్స్
- రేవణ్ణ శ్రీకృష్ణుడి రికార్డు బ్రేక్ చేయాలనుకుంటున్నాడని వ్యాఖ్య
- మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
- రామప్పను తక్షణం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్
లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను శ్రీకృష్ణుడితో పోలుస్తూ కాంగ్రెస్ నేత, కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి రామప్ప తిమ్మాపూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై భగ్గుమన్న బీజేపీ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని పట్టుబట్టింది.
ఓ సభలో మాట్లాడుతూ మంత్రి రామప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎంబీ పాటిల్ అన్నట్టు, రేవణ్ణ వీడియోలున్న పెన్ డ్రైవ్ ఉదంతానికి మించి దేశానికి తలవంపులు తెచ్చే ఘటన ఇప్పటివరకూ మరొకటి జరగలేదు. ఇది గిన్నిస్ రికార్డు కూడా గెలుచుకోవచ్చు. తనపై భక్తితో ఉన్న పలువురు మహిళలతో శ్రీకృష్ణుడు కలిసి జీవించాడు. ప్రజ్వల్ విషయంలో అలా కాదు కదా. బహుశా ఆ రికార్డును ప్రజల్వ్ బ్రేక్ చేద్దామనుకుంటున్నాడని నేను భావిస్తున్నా’’ అని విజయపురలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మంత్రి రామప్ప కామెంట్స్‌పై బీజేపీ భగ్గుమంది. మంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ‘‘కర్ణాటకలో కాంగ్రెస్ నేత శ్రీకృష్ణుడిని అవమానించాడు. అతడిని తక్షణం కేబినెట్ నుంచి, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. లేకపోతే మేము నిరసనలకు దిగుతాము’’ అని బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి సీటీ రవి వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు కాంగ్రస్ కూడా రామప్ప వ్యాఖ్యలను ఖండించింది. ఈ వివాదానికి దూరం జరిగే ప్రయత్నం చేసింది. ‘‘ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఇది మా పార్టీ అధికారిక అభిప్రాయం కాదు. రేవణ్ణ ఓ రాక్షసుడు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే పేర్కొన్నారు.