Nigar Sultana: అంపైర్ నిర్ణయంపై బంగ్లా కెప్టెన్ ఆగ్రహం.. బ్యాట్ విసిరికొట్టిన వైనం.. వీడియో వైరల్!
- భారత్‌తో మూడో టీ20లో ఘటన
- బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి
- అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇవ్వడం పట్ల సుల్తానా ఆగ్రహం
భారత మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా బౌలర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో ఆమెను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చారు. దాంతో అంపైర్ నిర్ణయం పట్ల సుల్తానా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంతృప్తితోనే మైదానం వీడిన ఆమె.. బయటకు వచ్చి బ్యాట్ విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, ఈ మ్యాచులో భారత్ ఆతిథ్య బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో 5 మ్యాచుల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.