Rahul Gandhi: రాయ్‌బరేలీ నుంచి రాహుల్.. అమేథీ నుంచి ప్రియాంక పోటీ: కాంగ్రెస్ వర్గాలు

Rahul Gandhi to contest from Rae bareli says party sources
  • రాయబరేలీ, అమేథీల్లో నామినేషన్‌ దాఖలుకు మే 20 చివరి తేదీ
  • రాయబరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేశ్ ప్రతాప్
  • నామినేషన్ పత్రాల దాఖలుకు రాహుల్ వెంట వెళ్లనున్న సోనియా
గాంధీ-నెహ్రు కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అమేథీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయొచ్చని చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించని విషయం తెలిసిందే. మే 20న నామినేషన్‌ దాఖలకు చివరి తేదీగా లోక్‌సభ ఐదో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకాలం రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేశారు. ఈ రెండు స్థానాలకు పార్టీ నామినేషన్ పేపర్లను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు, రాయబరేలీ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దినేశ్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ గురువారం ప్రకటించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన సోనియా గాంధీ చేతిలో పరాజయం పొందారు. ఇక గాంధీ కుటుంబ విశ్వాసపాత్రుడు  కిషోరీ లాల్ అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో అమేథీ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు సమర్పించేటప్పుడు సోనియా గాంధీ కూడా వెంట ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

అమేథీ నుంచి రాహుల్ గాంధీ వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2019 వరకూ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయనాడ్ ఎంపీగా ఉన్నారు. మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. అయితే, పార్టీ ఆదేశాల అనుసారం తాను నడుచుకుంటానని గతంలోనే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  2004 -24 మధ్య రాయ్‌బరేలీకి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆమె 1999లో అమేథీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అమేథీకి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ కూడా ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు.
Rahul Gandhi
Rae bareli
Priyanka Gandhi
Amethi
Uttar Pradesh
Congress

More Telugu News