Raghu Rama Krishna Raju: జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది.. ఆయన పని అయిపోయింది: రఘురామకృష్ణరాజు
- మేనిఫెస్టో విడుదల తర్వాత జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందన్న రఘురాజు
- కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని జోస్యం
- షర్మిల ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని నర్సాపురం ఎంపీ, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. నరసాపురం, గుంటూరు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ఫ్లాష్ సర్వేలో కూడా ఇదే తేలిందని అన్నారు. కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని చెప్పారు. జగన్ పని అయిపోయిందని అన్నారు. ఉండి నియోజకవర్గం పెదఅమిరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్ల జగన్ పాలనలో కుటుంబ నిర్వహణ కూడా భారంగా మారిపోయిందని... దీంతో, జగన్ ను మహిళలు కూడా వ్యతిరేకిస్తున్నారని రఘురాజు అన్నారు. ఉద్యోగులు, యువత, రైతులు, వ్యాపార వర్గాల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్... ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరినీ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రాకుండా చేసింది జగనే అని అన్నారు. సొంత చెల్లెలు షర్మిల అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.