Student Visa: అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. త్వరలో వీసా స్లాట్లు ఓపెన్
- స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్న యూఎస్
- తొలి విడతగా ఈ నెల రెండో వారంలో వీసా స్లాట్ల విడుదల
- ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి వీసా స్లాట్లు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్. యూఎస్ సర్కార్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ తాలూకు స్లాట్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా దశలవారీగా స్లాట్లను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక అగ్రరాజ్యంలో ఫాల్ సీజన్‌కు సంబంధించిన సెమిస్టర్ ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ప్రారంభం అవుతుందనే విషయం తెలిసిందే.
కాగా, ప్రతియేటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వీసా ఇంటర్వ్యూ తేదీల కోసం చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా కాన్సులేట్ కార్యాలయాల్లో స్టూడెంట్స్ కు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ ఆఫీస్ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు.
అలాగే తరచుగా వస్తున్న వెబ్‌సైట్ సమస్యను కూడా చక్కదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. వీసా స్లాట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను 2023 జులైలో ఆధునికీకరించామని చెప్పిన అధికారులు, సాంకేతిక లోపాలను తగ్గించేందుకు నూతన వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇంకా వెబ్‌సైట్ ఇబ్బందులు ఉంటే సాయం కోసం [email protected] ను సంప్రదించాలని కోరారు.
ఈ సందర్భంగా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. "యూఎస్-ఇండియా మధ్య ఉన్న సత్ససంబంధాల దృష్ట్యా భారత్‌కు అమెరికా అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. 2023లో ఏకంగా 11 లక్షల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను ఇండియన్స్‌కు అగ్రరాజ్యం జారీ చేసింది. అలాగే 3.75 లక్షల మందికి పిటిషన్ ఆధారిత తాత్కాలిక ఉపాధి వీసాలను (హెచ్1బీ) కూడా ఇవ్వడం జరిగింది.
ఇక భారతీయుల నుంచి వీసాల కోసం భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే హైదరాబాద్‌లో 300 మిలియన్ డాలర్లు వెచ్చించి కొత్త కార్యాలయాన్ని తెరిచాం. స్టెమ్ కోర్సులతో పాటు ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్, మైక్రో ఇంజనీరింగ్, కంప్యూటర్ కోర్సులైన ఏఐ, రోబోటిక్స్‌లపై కూడా భారతీయ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. అటు అమెరికా-భారతీయ యూనివర్సిటీలు నిర్వహిస్తున్న డ్యూయల్ డిగ్రీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
2022-23 గణాంకాల ప్రకారం యూఎస్‌లో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కి సంబంధించి 69,062 మంది విద్యార్థులతో ఇండియా మొదటి స్థానంలో ఉంది. వరుసగా మూడోసారి ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇండియన్ స్టూడెంట్స్ భారీ సంఖ్యలో అమెరికాలో చదువుకునేందుకు వెళ్లడం జరిగింది" అని అధికారి ప్రతినిధి చెప్పుకొచ్చారు.
కాగా, తాజా లెక్కల ప్రకారం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2,68,923కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా యూఎస్ సర్కార్ వెల్లడించింది. యూఎస్‌లో చదువుకుంటున్న ప్రతి మిలియన్ విదేశీ విద్యార్థులలో 25 శాతం మంది ఇండియన్సే ఉంటున్నారు. 2023లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 63 శాతం పెరగగా, అండర్ గ్రాడ్యుయేట్స్ 16 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.