Chandrababu: పెన్షనర్లను ఇబ్బందిపెట్టడం అత్యంత దుర్మార్గం: సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ

Harassment of pensioners is most evil says Chandrababu to CS Jawahar Reddy

  • పేదల ప్రాణాలతో రాజకీయమా అని ప్రశ్నించిన మాజీ సీఎం
  • పెన్షనర్లను ఎండల్లో నిలబెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపాటు
  •  అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమంటూ సీఎస్ జవహర్ రెడ్డిపై ఆగ్రహం

వృద్ధులు సహా పలువురు లబ్దిదారులు సామాజిక భద్రతా పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులుకాస్తున్న పరిస్థితులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. పెన్షనర్లను ఇబ్బందిపెట్టడం అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. పేదల ప్రాణాలతో రాజకీయమా అని ప్రశ్నించారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు పెన్షన్ లబ్ధిదారులను వేధించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమని సీఎస్ జవహర్ రెడ్డిని తప్పుబట్టారు.  ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వాధికారి జనాలకు మేలు చేసే అవకాశాల గురించి కనీసం కూడా ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరమని చంద్రబాబు మండిపడ్డారు. 

ఏప్రిల్ మాదిరిగా మే నెలలో కూడా  పెన్షన్‌దారులను రోడ్లపై మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి నరకయాతనకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల కోసం లబ్దిదారులను బ్యాంకుల వద్ద నిలబెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఇతర పెన్షన్ దారులను వెతలకు గురిచేయకుండా సకాలంలో పంపిణీ చేయాలంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చినా వాటిని విస్మరించారని చంద్రబాబు విమర్శించారు. గత నెలలో సచివాలయాల వద్ద బారులు తీరేలా చేసి 33 మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారని, లక్షలాది మందిని వేధించారని చంద్రబాబు అన్నారు.

ఇదంతా జగన్ పైశాచిక క్రీడ
ఇదంతా జగన్‌ ఆడుతున్న పైశాచిక క్రీడ అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యల చేశారు. దాదాపు 65 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత నెలలో 35 మంది చనిపోతే ఇప్పుడు ఒక్క రోజే దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ‘‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్ రెడ్డి, ఏ2 మీరే’’ అని జవహర్ రెడ్డిపై మండిపడ్డారు. గత నెలలో మండుటెండలో పెన్షనర్లను సచివాలయాల చుట్టూ తిప్పారని, ఇప్పుడు కూడా బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని విమర్శించారు. దారుణమైన ఎండల్లో లబ్దిదారులు బ్యాంకులకు ఏ విధంగా చేరుకుంటారని ప్రశ్నించారు. ఎక్కడో మండల కేంద్రాల్లో ఉన్న బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు.

ఒక్కరోజులోనే పెన్షన్ పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా రాజకీయ కుట్రలకు ప్రాధాన్యమివ్వడం దుర్మార్గమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పెన్షన్లను పంపిణీ చేసే వ్యవస్థ గ్రామస్థాయిలో ఉన్నప్పటికీ ఇళ్ల వద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా అధికార పార్టీ నాయకుల కుట్ర అని విమర్శించారు.  బ్యాంకులకు వెళ్లిన పెన్షనర్లను కేవైసీ కోసం ఆధార్, పాన్ తీసుకురావాలంటూ బ్యాంక్ సిబ్బంది కోరుతున్నారని, దీంతో తీవ్రమైన వేసవిలో లబ్దిదారులు రోడ్లపై తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

  • Loading...

More Telugu News