Rahul Gandhi: అమేథీ కాదని రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడానికి కారణాలు ఇవే!

Why Rahul Gandhi has been fielded from Rae Bareli and not choosen Amethi

  • సోనియా గాంధీ వారసుడు రాహుల్ గాంధీయేనని సందేశం ఇవ్వడమే కాంగ్రెస్ లక్ష్యమని విశ్లేషణలు
  • రాహుల్ పెద్ద నాయకుడు కావడంతో ‘రాహుల్ వర్సెస్ స్మృతి ఇరానీ’ అనే భావన కలగకూడదని అధిష్ఠానం లెక్కలు
  • అమేథీతో పోల్చితే రాయ్‌బరేలీ సేఫ్ సీటు అని భావించిన కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయించడంతో రాహుల్ నామినేషన్ వేశారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. అయితే రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఓడిపోయిన అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటి? చివరి నిమిషంలో ఈ స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అనే చర్చలు రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి.

రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీకి కారణాలు ఇవేనా..

సుదీర్ఘకాలం పాటు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించడం ద్వారా సోనియా వారసుడు రాహుల్ గాంధీయేనని ప్రజలకు సందేశం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావించి ఉండొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్మృతి ఇరానీ కంటే రాహుల్ గాంధీ పెద్ద నాయకుడు కావడంతో ‘రాహుల్‌ వర్సెస్‌ స్మృతి ఇరానీ’ మధ్య పోటీ అనే భావన కలగకూడదనేది కూడా కాంగ్రెస్ ఉద్దేశాల్లో ఒకటిగా ఉందని చెబుతున్నారు.

మరోవైపు అమేథీతో పోల్చితే రాయ్‌బరేలీ స్థానం రాహుల్ గాంధీకి సురక్షితంగా ఉంటుందని కాంగ్రెస్ అధినష్ఠానం లెక్కలు వేసుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ గాంధీ కుటుంబంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఒత్తిడి తెస్తుండడంతో ఆ విజ్ఞప్తిని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంది. 

రాయ్‌బరేలీలో గాంధీలను పోటీలో ఉంచకుంటే ఈ సీటును వదులుకున్నట్టేననే భావన ఏర్పడుతుందని, దీంతో రాహుల్‌ని రంగంలోకి దింపడం ద్వారా ఆ పార్టీ బలంగానే ఉందన్న సందేశం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ భావించి ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కాగా రాయ్‌బరేలీ నియోజకవర్గంలో 1999 నుంచి గాంధీలు విజయం సాధిస్తూ వస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ 1,67,178 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై విజయం సాధించారు. ఇక 2024లో రాహుల్ గాంధీ, దినేష్ ప్రతాప్ సింగ్ మధ్య పోటీ నెలకొంది.

  • Loading...

More Telugu News