IPL 2024: కోల్‌క‌తా విజ‌యం.. ముంబై ప్లేఆఫ్స్‌ ఆశ‌లు గ‌ల్లంతు!

KKR beat MI for second ever win at Wankhede

  • సొంత మైదానం వాంఖడేలో ముంబైని చిత్తుచేసిన నైట్‌రైడర్స్‌
  • 24 ప‌రుగుల తేడాతో కోల్‌క‌తా ఘ‌న‌ విజ‌యం
  • సూర్య‌కుమార్ హాఫ్ సెంచ‌రీ (56) వృథా
  • 70 ప‌రుగులు చేసి కేకేఆర్ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దిన‌ వెంక‌టేశ్ అయ్యర్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' 
  • 12 ఏళ్ల త‌ర్వాత వాంఖ‌డేలో ముంబైపై కేకేఆర్ విజ‌యం

వాంఖ‌డే మైదానంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) తో జ‌రిగిన మ్యాచులో ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) ప‌రాజ‌యం పాలైంది. 170 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై.. సూర్య‌కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీ (56) మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు చేతులెత్తేయ‌డంతో 145 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో కోల్‌క‌తా 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీసి ఎంఐని తీవ్రంగా దెబ్బ‌తీశాడు. అత‌నికి తోడు న‌రైన్‌, ర‌సెల్‌, వ‌రుణ్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అంత‌కుముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 169 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఈ ఓట‌మితో ముంబై ప్లేఆఫ్స్ ఆశ‌లు దాదాపు గ‌ల్లంత‌య్యాయి. కేకేఆర్ బ్యాట‌ర్ల‌ను ప్రారంభంలో తుషార భ‌య‌పెట్టాడు. త‌న మొదటి రెండు ఓవ‌ర్లలోనే 3 వికెట్లు తీశాడు. దీంతో కోల్‌క‌తా 57 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఇలా క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును వెంక‌టేశ్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీ (70), మ‌నీశ్ పాండే (42) ద్వ‌యం ఆదుకుంది. ఈ జోడి 83 ప‌రుగుల అద్భుత‌మైన‌ భాగ‌స్వామ్యం అందించ‌డంతో కేకేఆర్ కోలుకుంది. ఈ ఇద్ద‌రి కార‌ణంగానే ఆ జ‌ట్టు 169 ప‌రుగుల గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది. ముంబై బౌల‌ర్ల‌లో తుషార‌, జస్ప్రీత్ బుమ్రా త‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హార్దిక్ పాండ్యా 2, పియూష్ చావ్లా ఒక వికెట్ తీశారు. 

అనంత‌రం ఛేదనలో ముంబై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్‌కు చేర‌డంతో ఎంఐకి మరో ఓట‌మి తప్పలేదు. ముంబై ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఇషాన్‌ (13)ను స్టార్క్‌ బౌల్డ్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నమన్‌ ధీర్‌ (11)ను చక్రవర్తి 5వ ఓవర్లో తన స్పిన్‌ మాయాజాలంతో బోల్తా కొట్టించాడు. రోహిత్‌ (11) కూడా నరైన్‌ ఆరో ఓవర్లో మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తిలక్‌ వర్మ (4), వధెరా (6), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (1) మ‌రోసారి నిరాశ‌ప‌రిచారు. 

ఇక వరుసగా వికెట్లను కోల్పోతూ ఓటమి వైపుగా సాగుతున్న ముంబైని సూర్య ఆదుకునే ప్ర‌యత్నం చేశాడు. వైభవ్ వేసిన‌ 14వ ఓవర్లో సూర్యకుమార్‌ 4, 6, 4, 4 తో ముంబై ఇండియ‌న్స్‌ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అదే స‌మ‌యంలో 30 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ ఆండ్రీ ర‌సెల్ వేసిన‌ 16వ ఓవర్లో ఫుల్‌టాస్‌ను ఆడబోయి సాల్ట్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ముంబై ఓటమి ఖరారైంది. 

కాగా, 52 బంతుల్లో 70 ప‌రుగులు చేసి కేకేఆర్ ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దిన‌ వెంక‌టేశ్ అయ్యర్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కింది. ఈ ప‌రాజ‌యంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశ‌లు దాదాపు గ‌ల్లంత‌య్యాయి. ఈ సీజన్‌లో 8వ ఓటమితో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది. మ‌రోవైపు కోల్‌క‌తా తాను ఆడిన 10 మ్యాచుల్లో 7 విజ‌యాల‌తో ప్లేఆఫ్స్‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. 

12 ఏళ్ల త‌ర్వాత వాంఖ‌డేలో ముంబైపై కోల్‌కతా విక్ట‌రీ
ముంబై ఇండియ‌న్స్ తో నిన్న‌టి మ్యాచులో విజయం కేకేఆర్‌కు చాలా ప్ర‌త్యేకం అని చెప్పాలి. ఎందుకంటే ప‌న్నెండేళ్ల త‌ర్వాత వాంఖ‌డే వేదిక‌గా ఎంఐపై కోల్‌క‌తా విజ‌యం సాధించింది. చివ‌రిసారిగా వాంఖ‌డేలో ముంబైపై 2012లో గెలిచింది. ఓవ‌రాల్‌గా వాంఖ‌డే వేదిక‌గా ఇరు జ‌ట్లు 11 సార్లు త‌ల‌ప‌డ‌గా ముంబై 9 సార్లు గెలిస్తే, కేకేఆర్ రెండింటిలో మాత్ర‌మే విజ‌యం సాధించింది.

రోహిత్ శ‌ర్మ చెత్త రికార్డు.. బుమ్రా అరుదైన ఘ‌న‌త‌
ఐపీఎల్‌లో ముంబై మాజీ సార‌ధి రోహిత్ శ‌ర్మ ఓ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్నాడు. అత్య‌ధికసార్లు (8) ఒకే బౌల‌ర్ (సునీల్ న‌రైన్‌) కు వికెట్ పారేసుకున్న ఆట‌గాడిగా నిలిచాడు. ఇక ఏడుసార్ల చొప్పున ఎంఎస్ ధోనీ (జ‌హీర్ ఖాన్‌), విరాట్ కోహ్లీ (సందీప్ శ‌ర్మ‌), రిష‌భ్‌ పంత్ (జ‌స్ప్రీత్ బుమ్రా), అజింక్య ర‌హానే (భువ‌నేశ్వ‌ర్ కుమార్‌), రోహిత్ శ‌ర్మ (అమిత్ మిశ్రా), రాబిన్ ఉత‌ప్ప (అశ్విన్‌), అంబ‌టి రాయుడు (మోహిత్ శ‌ర్మ‌) ఔట్ అయ్యారు. 

మ‌రోవైపు ముంబై బౌల‌ర్‌ జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఒకే వేదిక‌లో 50 ప్ల‌స్ వికెట్లు తీసిన ఐదో బౌల‌ర్‌గా రికార్డుకెక్కాడు. అత‌ను ముంబైలోని వాంఖ‌డే మైదానంలో మొత్తం 51 వికెట్లు తీశాడు. సునీల్ న‌రైన్ (61-కోల్‌క‌తా) మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా లసిత్ మ‌లింగ (58-ముంబై), అమిత్ మిశ్రా (58-ఢిల్లీ), య‌జువేంద్ర చాహ‌ల్ (52-బెంగ‌ళూరు) ఉన్నారు.

  • Loading...

More Telugu News