Brazil: బ్రెజిల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి!
- దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు
- భారీగా కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి, 74 మంది గల్లంతు
- పరిస్థితులు అదుపుతప్పడంతో ఎమర్జెన్సీ ప్రకటించిన రాష్ట్ర గవర్నర్ ఎడూర్డో లీట్
- వర్ష ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే సాయం అందిస్తామన్న అధ్యక్షుడు లుజ్ ఇనాసియో లులా డ సిల్వా
బ్రెజిల్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ చూడని డిజాస్టర్‌గా అక్కడి వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగి పడటంతో 37 మంది మృతిచెందారు. అలాగే సుమారు 74 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్రవ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇక భారీ వర్షాల కారణంగా పొటెత్తిన వరదలకు వంతెనలు, ఇళ్లు కూలిపోయి భారీగా శిథిలాలు పేరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆ శిథిలాలను తొలగించే పనిలో రెస్క్యూ సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల పరిస్థితులు అదుపు తప్పినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఎడూర్డో లీట్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే సాయం అందిస్తామని దేశ అధ్యక్షుడు లుజ్ ఇనాసియో లులా డ సిల్వా ప్రకటించారు.
మరోవైపు ఫెడరల్ బలగాలు భారీగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. 12 విమానాలు, 45 వాహనాలు, 12 బోట్లను రంగంలోకి దించాయి. సుమారు 700 మంది సైనికులు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇళ్లు కోల్పోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహారం, తాగు నీటిని అందిస్తున్నారు. ఇక కొండచరియలు విరిగి పడడంతో చాలా ప్రాంతాలు మట్టిదిబ్బలను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వాహనాలన్నీ ఆ మట్టిలో మునిగిపోయాయి. స్థానిక గుయిబా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.