MI Vs KKR: ముంబై-కేకేఆర్ మ్యాచ్‌లో టాస్ ఫిక్సింగ్ కలకలం.. వీడియో ఇదిగో!
- గత రాత్రి ముంబై-కేకేఆర్ మధ్య మ్యాచ్
- టాస్‌ను కెమెరామన్‌కు చూపించకుండానే తీసేసుకున్న రిఫరీ
- ముంబైకి ఫేవర్‌గా చెప్పిన రిఫరీ పంజక్
- కిందపడిన టాస్‌ను తీయడంపైనా అనుమానాలు
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ ఫిక్సింగ్ కలకలం రేగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ సందర్భంగా ఫిక్సింగ్ జరిగిందంటూ తాజాగా అభిమానులు, నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తూ టాస్ వీడియోను షేర్ చేస్తున్నారు.
సాధారణంగా టాస్ వేసిన తర్వాత దానికి కెమెరా జూమ్ చేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌లో పాండ్యా టాస్ వేసిన తర్వాత రిఫరీ పంకజ్ ధర్మానె ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దానిని చేతుల్లోకి తీసుకుని పాండ్యా టాస్ గెలిచినట్టు ప్రకటించాడు. కెమెరామన్ టాస్‌ను చూపించే అవకాశం కూడా ఇవ్వలేదు. అంతేకాదు, నాణేన్ని రివర్స్‌లో తీయడం కూడా కనిపించింది. దీంతో టాస్ రిగ్గింగ్ జరిగిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. వీడియో చూసిన వారు ఫిక్సింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదే తొలిసారి కాదు
ఈ సీజన్‌లో టాస్ రిగ్గింగ్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. కిందపడిన టాస్‌ను తీసుకునేముందు రిఫరీ జవగళ్ శ్రీనాథ్ దానిని మరోవైపునకు తిప్పాడన్నది అభిమానుల ఆరోపణ. దీనిని తీవ్రంగా ఖండించిన బ్రాడ్‌కాస్టర్లు టాస్ ఫిక్సింగ్‌కు అవకాశమే లేదని కొట్టిపడేశారు. భవిష్యత్తులో మరోమారు ఇలాంటి ఆరోపణలు రాకుండా టాస్ కాయిన్‌ను కెమెరామన్ జూమ్ చేస్తాడని పేర్కొన్నారు. కానీ, మళ్లీ ఈ మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ కావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.