Irfan Pathan: ముంబై ఖేల్‌ఖతం.. ఎంఐ ప్రదర్శనపై ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర వ్యాఖ్యలు!
- నిన్నటి కేకేఆర్‌తో మ్యాచులో ముంబై ప్రదర్శనపై పెదవి విరిచిన భారత మాజీ ఆల్‌రౌండర్
- ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసిందని వ్యాఖ్య
- మరోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై దుమ్మెత్తిపోసిన ఇర్ఫాన్ పఠాన్
నిన్నటి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తో మ్యాచులో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ప్రదర్శనపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసిందని అన్నాడు. పఠాన్ మాట్లాడుతూ.. "కేకేఆర్ ఐదు వికెట్లు కోల్పోయినప్పుడు నమన్ ధీర్‌తో బౌలింగ్ చేయించడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అనుమానాలు నిజమయ్యాయి. ఆ సమయంలో మంచి అటాకింగ్ బౌలర్లతో బౌలింగ్ చేయించుంటే ఫలితం మరోలా ఉండేది. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్, మనీశ్ పాండే భాగస్వామ్యం కోల్‌కతాకు కలిసొచ్చింది. ఆటగాళ్లు సారధిని స్వీకరించడమనేది చాలా ముఖ్యం. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టులో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు" అని చెప్పుకొచ్చాడు. ఇర్ఫాన్ పఠాన్ ఎంఐ ప్రదర్శనపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 11 మ్యాచులాడిన ముంబై కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. దీంతో ఎంఐ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై జట్టు చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్సీ మార్పు ఆ జట్టును తీవ్రంగా దెబ్బ తీసిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.