Revanth Reddy: ఇప్పుడు చెప్పండి చెప్పుతో ఎవరిని కొట్టాలి: ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ల మీద సవాళ్లు
- ఖమ్మం వేదికగా కేసీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు రేవంత్ రెడ్డి సవాల్
- 8వ తేదీలోగా మిగిలిన బకాయిలు చెల్లించే బాధ్యత మాదే
- 9వ తేదీ నాటికి ఒక్కరైతుకు బకాయి ఉన్నా ముక్కు నేలకు రాస్తానని సవాల్
- అందరికీ అందితే కేసీఆర్ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్న
- కేసీఆర్ మా కూటమిలో చేరుతామన్నా చేర్చుకోమని వ్యాఖ్య
- ఇప్పుడు చెప్పుతో ఎవరిని కొట్టాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని ప్రశ్న
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ... రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న వారిని చెప్పుతో కొట్టాలని బీజేపీ నేతలు చెబుతున్నారని... కానీ వారి పార్టీ నేత దుష్యంత్ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో వారు చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు కిషన్ రెడ్డిని కొట్టాలా? సంజయ్‌ని కొట్టాలా? లేక అలా అన్నవాడిని కొట్టాలా? అని ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాము ఇప్పటి వరకు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని... ఈ నెల 8వ తేదీలోగా మిగిలిన బకాయిలు చెల్లించే బాధ్యత కూడా మాదే అన్నారు. మే 9వ తేదీ రోజున ఒక్క రైతుకు బకాయి ఉన్నా అమరవీరుల స్థూపం వద్ద తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. ఒకవేళ అందరికీ అందితే కేసీఆర్ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాస్తారా? అని సవాల్ చేశారు. కేంద్రంలో రెండు సంకీర్ణాలు ఉన్నాయని... కేసీఆర్ ఎందులో చేరుతారో చెప్పాలని నిలదీశారు. దేశ రాజకీయాలకు ఖమ్మం దిక్సూచి అన్నారు. కేసీఆర్ తమ కూటమిలో చేరుతానని చెప్పినా చేర్చుకునేది లేదని... ఆయన బీజేపీ సంకీర్ణంలోనే చేరుతారని జోస్యం చెప్పారు. అనేక బిల్లులకు బీజేపీకి కేసీఆర్ మద్దతిచ్చారన్నారు.
ఈ నెల 9వ తేదీలోగా ఆసరా పెన్షన్లు కూడా ఇస్తామన్నారు. పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచే లోక్ సభ స్థానాల్లో ఖమ్మం ఒకటి అన్నారు. పోరాటాల గడ్డగా ఖమ్మం జిల్లాకు పేరు ఉందన్నారు. 1996 ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచే మొదలైందన్నారు. ఖమ్మం ప్రజలు ప్రారంభించిన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
కేసీఆర్ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ సాధించిన తర్వాత 2014, 2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గత ఏడాది సెమీ ఫైనల్స్‌లో బీఆర్ఎస్ను ఓడించామని, ఈ నెల 13న జరిగే ఫైనల్స్‌లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజున జరిగే పోలింగ్‌లో మనం గుజరాత్ టీంను ఓడించాల్సి ఉందన్నారు.