Land Titling Act: ఏ రాష్ట్రంలో అమలులో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలోనే ఎందుకు... జగన్ ప్లాన్ ఇదే: నీలాయపాలెం విజయ్

TDP slams AP Govt on Land Titling Act

  • వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
  • ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విపక్షాలు
  • జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ బట్టబయలైందన్న టీడీపీ అధికార ప్రతినిధి

జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుట్టు బట్టబయలు అయ్యిందని.. ఏపీ ప్రజల ఆస్తులను కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎసరు పెట్టాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇప్పటికే 4 వేల గ్రామాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ సర్వేను పూర్తి చేసి ప్రజల ఆస్తుల వివరాలను అమెరికాలోని ఒక ప్రైవేట్ సాఫ్ట్ వేర్ సంస్థ క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేతిలో పెట్టాడని ఆరోపించారు. విజయకుమార్ ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

"ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జనాలను జగన్ భయపెడుతున్నాడు. జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ చట్టంపై జనాలు ఆందోళన చెందుతున్నారు. ఆస్తుల పత్రాలు ఏమైపోతాయోనన్న భయంలో జనాలు ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఎక్కడెడక్కడ ఏమి కొట్టేయాలో జగన్ ముందే ప్లాన్ చేశారు. అందుకే కేంద్రం మూడు సార్లు తిరస్కరించినా వెంటబడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకు వచ్చారు.

రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయబడే భూ లావాదేవీల పత్రాలు ఇక నుండి స్టాంప్ పేపరులో ఇవ్వరట. e- స్టాంప్  పేపర్ ద్వారా ఇస్తారట. ఈ ప్రభుత్వం ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ డిజిటలైజ్ చేసి దాచి పెడతామంటోంది. ఈ పత్రాలను ఎన్ఐసీ( నేషనల్ ఇన్ఫర్ మేటిక్ సెంటర్)లో పెడతారని అనుకున్నాం. కాని క్రిటికల్ రివర్ అనే ప్రైవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీ చేతుల్లో పెడుతున్నారంట.

పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారం మేరకు... ఈ  క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ, అమెరికాలోని కాలిఫోర్నియాలో తమ ప్రధాన కార్యాలయం కలిగ, నెం. 4683, ఛాబోట్ డ్రైవ్, సూట్ నెం. 350, ప్లెజెంటన్ , కాలిఫోర్నియా - 94588 అడ్రెస్ లో ఉంది. మనదేశంలో హైదరాబాద్ మాదాపూర్ లో ఒక బ్రాంచ్ ఆఫీసును ఏర్పరిచి రెండు సంవత్సరాల క్రితం సిబ్బందిని నియమించుకున్నారు. 

ప్రజల ఆస్థుల పత్రాల భద్రతకు సంభందించిన ఈ అతి కీలకమైన పనిని భారత ప్రభుత్వానికి చెందిన NIC కి కాకుండా ఒక ప్రైవేటు సంస్థకు ఎందుకిచ్చారు. కారణాలేంటి? రాజ్యాంగపరమైన హక్కు ఉన్న ప్రజల ప్రైవేటు ఆస్తి పత్రాలను వేరే దేశంలో వున్న ఒక ప్రైవేటు సంస్థకు ఇచ్చేటప్పుడు ప్రజలకు బహిరంగ ప్రకటన ఇచ్చారా? అభ్యంతరాలు స్వీకరించారా? భారత ప్రభుత్వము నుంచి తగిన అనుమతులు పొందారా?

ఓపెన్ టెండర్ ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? ఎంత మంది అప్లై చేశారు? L1, L2, L3 ఎవరు? క్రిటికల్ రివర్ కంపెనీని ఎలా గుర్తించారు? క్రిటికల్ రివర్ ట్రాక్ రికార్డ్ ను ఏవిధంగా మదింపు చేశారు? వాళ్లకు ఇచ్చే ఫీజు ఎంత? 

అసలు క్రిటికల్ రివర్ కు మీరు కాంట్రాక్ట్  ఇవ్వలేదని బొంకాలని చూస్తే... ఇటీవల ప్రజల ఆస్తుల పత్రాలు క్రిటికల్ రివర్ చేతుల్లోకి వెళ్లినట్లు పేపర్లలో వచ్చిన వార్తలపై ఎందుకు స్పందించలేదు. అసలు రెవెన్యూ శాఖను ధర్మానే చూసుకుంటున్నారా? అసలు ధర్మాన రెవెన్యూ మంత్రేనా? మీ సీఎంఓనే అంతా చూసుకుంటుందా? 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై 2023 అక్టోబర్ 31న జీవో నెం. 512 ను విడుదల చేశారు. మరుసటి రోజే, 2023 నవంబర్ 1న  గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. స్టేట్ లాండ్ డెవలప్ మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేశారు. 2022 నుంచే భూ హక్కు పాస్ బుక్ లు ఇచ్చారు. ఆ చట్టం కిందనే భూముల రీసర్వే  కూడా చేశారు. 2024 మే 2 నుండి రాష్ట్రం మొత్తంలో 16 ఎంపిక చేసిన రిజిస్టర్ ఆఫీసుల్లో కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టమని చెప్పారు. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లో లేదంటూ ధర్మాన బుకాయించడం చూస్తే అసలు ధర్మాన మంత్రేనా అన్న అనుమానం వస్తుంది. 

కేంద్రంపై సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ 2019 నవంబర్ లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం మొదలు పెడితే, దానికంటే ఐదు నెలల ముందే, 2019 సెప్టెంబర్ లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తయారు చేసి కేంద్రానికి పంపారు. ఆ డ్రాఫ్ట్ చట్టంలో పలు తప్పులు ఉన్నాయని దాన్ని ముడు సార్లు కేంద్రం రాష్ట్రానికి తిప్పి పంపింది. చివరికి 2023లో రాష్ట్రం చట్టం చేసింది. 

ల్యాండ్ టైటిలింగ్ చట్టం తాము చేయలేదని, అది నీతి ఆయోగ్ ఇచ్చిందని, జాతీయ స్థాయిలో రాష్ట్రాలను ఈ చట్టాన్ని అమలు చేయాలని ఒత్తిడి తెస్తోందని, జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కావాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. 

దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా మనల్ని మాత్రమే నీతీ ఆయోగ్ ఒత్తిడి చేస్తోందా? చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. మరి మిగతా రాష్ట్రాలు ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాలు చేయనప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మాత్రం ఎందుకు చేసింది? 

ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లుగా తమవారినే నియమించుకుని వారికి సర్వాధికారాలు కట్టబెట్టి.. కావాలనే భూ వివాదాలు సృష్టిస్తారు. ఇక భూ యజమానులు వైసీపీ అనుంగ టీఆర్వో ఆఫీసర్ వద్దకు వెళ్లినా ఆ సమస్య పరిష్కారం కాదు. సమస్యలు పరిష్కారం కాకపోగా అడిగిన సమాచారం ఇవ్వకుంటే రైతులకు ఆరు నెలలు జైలు శిక్ష వేసే అధికారం ఆ టీఆర్వో ఆఫీసర్ కు ఇచ్చారు. భూ యజమానులు జగన్ రెడ్డి పెట్టిన ట్రైబ్యునల్ వద్దకు వెళ్లినా న్యాయం జరగదు. అక్కడ కాకుంటే హైకోర్లుకు వెళ్లాలి. హై కోర్టుల చుట్టూ తిరగడమే ఇక భూ యజమానుల పని అవుతుంది.  

ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన ఇప్పటికే మెడలోతులో ప్రజలు కూరుకుపోయారు. ఈ చట్టం తమ కాళ్లకింద భూమిని కదిలించేస్తుంటే, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు సామాన్య ప్రజలు. ఈ దుర్మార్గాన్ని ఆపాలంటే మనకు ఉన్న ఒకే మార్గం జగన్ రెడ్డిని  కుర్చీ ఖాళీ చేయించడమే. జరుగు జగన్ జరుగు జగన్, జూన్ 4వ తేదీ కుర్చీ ఖాళీ చేయి జగన్ అని ప్రజలు నినధించి ఈ ప్రభుత్వాన్ని తమ ఓటుద్వారా దించేస్తేనే ప్రజల ఆస్తులకు రక్షణ ఉంటుంది" అని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News