Sharmila: నా ప్రశ్నకు జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల
- తండ్రి పేరుని సీబీఐ ఛార్జిషీటులో చేర్పించింది జగనేనన్న ఏపీసీసీ
- మూడు కోర్టుల చుట్టూ తిరిగి చేర్చించినందుకే పొన్నవోలుకు ఏఏజీ పదవి ఇచ్చారని ఆరోపణ
- రాజశేఖర్ రెడ్డి పేరు సీబీఐ ఛార్జిషీటులో చేర్చలేదని సోనియా చెప్పారని ప్రస్తావన
తండ్రి పేరుని సీబీఐ ఛార్జిషీటులో చేర్చాలంటూ మూడు కోర్టులు తిరిగిన వ్యక్తికి ఏఏజీ పదవిని అప్పజెపుతారా అని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పదవిని ఇచ్చారని. ఈ నిర్ణయం జగన్ ఆదేశాల మేరకు జరగకపోతే పొన్నవోలుకు ఈ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆమె అన్నారు. జగన్ ఆదేశాల మేరకే పొన్నవోలు కోర్టులకు తిరిగారని చెప్పడానికి ఈ పదవే ఒక రుజువని షర్మిల వ్యాఖ్యానించారు. తన తండ్రి పేరుని సీబీఐ ఛార్జిషీటులో చేర్చాలంటూ కోర్టులకు తిరిగిన వ్యక్తికి తానైతే అలాంటి పదవిని ఇవ్వబోనని ఆమె స్పష్టం చేశారు.
‘‘ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి చెబుతున్నాను. రాజశేఖర్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఛార్జిషీటులో చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్ పట్టుబట్టి చేర్చారు. అయితే ఇప్పుడు నేను మాటలు మార్చినట్టుగా పొన్నవోలు నా పాత వీడియోలను వెతికి మరీ చూపిస్తున్నారు. నన్ను ఊసరవెళ్లిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు నిజం తెలియక మేము అలా మాట్లాడాం. ఈ రోజు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మొన్న సోనియా గాంధీ గారిని కలిస్తే ఆ విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పారు. నేను పెట్టలేదని సోనియా గాంధీ అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే చెప్పారు. పొన్నవోలు సుధాకర్ మూడు కోర్టులకు తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చేర్చించారని ఆయన చెప్పేదాకా నాకు తెలియదు’’ అని షర్మిల వెల్లడించారు. ఈ మేరకు శనివారం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు.