Sunset: అంతరిక్షంలో సూర్యాస్తమయం.. ఎలా ఉంటుందో చూశారా?
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఫొటోను విడుదల చేసిన నాసా
- అధికారిక ఇన్ స్టా అకౌంట్లో పోస్టు
- భూమి, ఆకాశం నల్లగా.. వాతావరణం మాత్రం మెరిసిపోతూ ఆకట్టుకుంటున్న చిత్రం
సూర్యోదయం, సూర్యాస్తమయం.. ఉభయ సంధ్యలను చూడాలని కోరుకోనివారెవరు? సూర్య నమస్కారాలతో ఉదయాన్ని.. సాయం సంధ్య వేళలలో యోగాతో రాత్రిని ఆహ్వానిస్తుంటారు కూడా. భూమ్మీద సూర్యాస్తమయాన్ని చూడటం సరే.. మరి అంతరిక్షంలోంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా?
ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసిన నాసా..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసిన ఫొటోను విడుదల చేసింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఐఎస్ఎస్ లోని ఓ వ్యోమగామి ఈ చిత్రాన్ని క్లిక్ మనిపించారు. తాజాగా నాసా దీనిని తమ అధికారిక ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేసింది.
భూమి, ఆకాశం నల్లగా ఉండి.. భూమి నుంచి కిందికిపోతూ సగం మేర కనిపిస్తున్న సూర్యుడితో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. సూర్యుడి కిరణాల ప్రభావంతో.. ఎగువన నీలి రంగులో, మధ్యలో తెల్లగా, దిగువన నారింజ రంగులో వాతావరణ పొరలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.
నిజానికి సూర్యాస్తమయం కాదట
- ఇది నిజానికి సూర్యాస్తమయం కాదని నాసా పేర్కొంది. ఎందుకంటే భూమిపై 400 కిలోమీటర్ల ఎత్తున ఐఎస్ఎస్ అతి వేగంగా తిరుగుతూ ఉంటుంది.
- అది రోజుకు 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. అంటే ఈ 16 సార్లు కూడా.. అందులోని వ్యోమగాములకు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కనిపిస్తాయి మరి.
- వీటిని ఆర్బిటల్ సన్ రైజ్, ఆర్బిటల్ సన్ సెట్ గా పిలుస్తారని నాసా తెలిపింది. అలా ఓసారి సూర్యాస్తమయం అవుతుందగా ఈ ఫొటో తీసినట్టు వెల్లడించింది.