Mothkupalli Narsimhulu: కాంగ్రెస్కు ఓటేస్తే నన్ను చంపినట్లే... మాదిగ బలమేంటో చూపిస్తాం: కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు
- మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా
- మూడు ఎస్సీ రిజర్వ్ సీట్లలో కాంగ్రెస్ ఒక్కరికీ ఇవ్వలేదన్న మోత్కుపల్లి, మంద కృష్ణ
- మాదిగలు, బీసీలు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపు
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తనను చంపినట్లేనని... ముఖ్యమంత్రికి మన బలమేంటో చూపిద్దామని కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మోత్కుపల్లి పాల్గొని సొంత ప్రభుత్వంపై మండిపడ్డారు.
'నా అక్కాచెల్లెల్లందరికీ చెబుతున్నా... రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను మీరు చంపినట్లే. రేవంత్ రెడ్డికి ఓటేస్తే మీరు మోత్కుపల్లి నర్సింహులును చంపినట్లే. మీ కోసం నా జీవితం ఇస్తా. మీ కోసం నా ప్రాణం ఇస్తా. ఈ జాతి గౌరవం నిలబడాలి. మన బలమేంటో తెలియాలి. మాదిగ బలమేంటో మీకు చూపిస్తాం రేవంత్ రెడ్డీ' అన్నారు.
తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి మాదిగల బలాన్ని చూపించాలని అన్నారు. మాదిగల బలం కాంగ్రెస్ పార్టీకి తెలిసేలా చేస్తామన్నారు. తమకు గౌరవం ఇవ్వకపోతే కాంగ్రెస్ను పాతిపెడతామన్నారు. పుట్నాలు పంచితే ప్రజలు ఓటేశారనుకున్నావా? పుట్నాలకు ఆశపడే వాళ్లం కాదు... ఆత్మగౌరవం.. మా జాతి గౌరవం మాకు ముఖ్యమన్నారు. మాకు గౌరవం ఇస్తే సహకరిస్తామని... గౌరవించకుంటే ఊరుకునేది లేదన్నారు.
మాదిగలు, బీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఏనాడు లేనివిధంగా కాంగ్రెస్ మాదిగలను అవమానించిందన్నారు. తమ ఇందిరా పార్క్ దీక్షను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో దళితుల ఆధ్వర్యంలో ధర్నా ఏర్పాటు చేశారని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మాదిగల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రమాదం ఉందన్నారు. మోదీతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదని... కాంగ్రెస్కు మాత్రం ప్రమాదం ఉందన్నారు.