BJP: ఢిల్లీలో కాంగ్రెస్‌కు షాక్, బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
- కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమక్షంలో కమలం గూటికి చేరుకున్న అమ్రిందర్
- ఆమ్ ఆద్మీ పార్టీతో జత కట్టడం వల్లే తాను పార్టీని వీడినట్లు ఇటీవలే ఖర్గేకు లేఖ
- కేజ్రీవాల్ అరెస్టైనప్పుడు ఇష్టం లేకపోయినా అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన ఇంటికి వెళ్లినట్లు వెల్లడి
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అమ్రిందర్ సింగ్ లవ్లీ శనివారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో కమలం గూటికి చేరారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో జతకట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికే ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన రోజున తనకు ఇష్టం లేకపోయినప్పటికీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. కాగా, అమ్రిందర్ సింగ్ లవ్లీ 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2017లో బీజేపీలో చేరారు. తొమ్మిది నెలల తర్వాత బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.