Nara Rohith: శ్రీకాకుళం జిల్లాలో మొదలైన 'మన కోసం మన నారా రోహిత్’

Nara Rohith stepped into election campaign for alliance candidates

  • కూటమి అభ్యర్థుల తరఫున నారా రోహిత్ ఎన్నికల ప్రచారం
  • నేడు పలాస, ఎచ్చెర్ల, అనకాపల్లి నియోజకవర్గాల్లో పర్యటన
  • రాక్షస పాలన అంతానికే మూడు పార్టీల పొత్తు అని వెల్లడి

తెలుగుదేశం, జనసేన, భాజాపా అభ్యర్ధుల గెలుపు కోసం ప్రముఖ సినీ నటుడు, టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టారు. 

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి ఇవాళ 'మన కోసం మన నారా రోహిత్' కార్యక్రమానికి నారా రోహిత్ శ్రీకారం చుట్టారు. మొదటి రోజు పలాస, ఎచ్చెర్ల, అనకాపల్లి నియోజకవర్గాల్లో నారా రోహిత్ పర్యటించారు. నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలో నారా రోహిత్ పాల్గొన్నారు.

పలాస నియోజకవర్గం, మందస మండలం బహిరంగ సభలో నారా రోహిత్ మాట్లాడుతూ... “ఐదేళ్ల రాక్షస పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ అయిన వచ్చిందా..? రాష్ట్రం నుంచి అమరరాజా, లూలు కంపెనీలను తరిమి వేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. 

చంద్రబాబు కియా మోటార్‌ పరిశ్రమలను అనంతపురానికి తీసుకువచ్చి రాష్ట్రాన్నే అభివృద్ధి పథంలో నడిపారు. ఐదేళ్లలో జగన్ ఒక్క కంపెనీ తేలేదు. చంద్రబాబు అనేక పరిశ్రమలు తెచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. 

ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ప్రజల పక్షాన ప్రశ్నించే నాయకుడు.. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఎలా నిలదీశారో దేశ ప్రజలందరూ చూశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించిన గౌతు శిరీషలాంటి వారిని అసెంబ్లీకి పంపించాలి. ఆమె ధైర్యానికి మీ ఓటు ఆయుధంగా మారాలి. 

ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది. ఓటు హక్కు అనేది రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు. ప్రలోభాలకు గురవ్వకుండా మీ బిడ్డల బంగారు భవిష్యత్తు చేసే కూటమి అభ్యర్ధులకు ఓటు వేయండి” అని కోరారు.

అనంతరం ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించి కూటమి అభ్యర్ధులకు మద్దతు పలకాలని నియోజకవర్గ ప్రజలను నారా రోహిత్ కోరారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
”రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. అవినీతి, అరాచకాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు రావాలి. 

ఎన్నికలు మరో పది రోజులు మాత్రమే ఉన్నాయి. కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరరావు గెలుపు కోసం అందరూ సమిష్టి కృషి చేయాలి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకి న్యాయం జరగలేదు. ప్రశ్నించిన వారిని అంతం చేయడమే వైసీపీ అభ్యర్ధుల నైజం. భవిష్యత్ తరాలు బాగుండాలంటే బాబు మళ్ళీ రావాలని” అని అన్నారు.

అనకాపల్లి బహిరంగ సభలో నారా రోహిత్ మాట్లాడుతూ... ”2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం వలన మన రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. నాడు మన భవిష్యత్ తల రాతని మనమే రాసుకున్నాం. రాష్ట్రంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మీరే చూస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంట నూనె, నిత్యవసర సరుకులు, కరెంటు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, చివరకి చెత్త మీద కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా..? 

కోట్లు సంపాదించుకునే సినీ పరిశ్రమను వదిలేసి ప్రజల కష్టాలను చూసి ఆ కష్టాలను తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలి? 73 ఏండ్ల వయస్సులో తెలుగు ప్రజలకు ఏదో చేయాలని పట్టుదలతో మండుటెండల్లో రోడ్ల మీదకు రావాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఎందుకు? యువతకు బంగారు భవిష్యత్తునివ్వడమే వీళ్ళద్దరి ధ్యేయం. అదే వీళ్ళిద్దరినీ కలిపింది. రావణాసురుడిని అంతం చేయడానికి అందరూ ఎలా కలిశారో అలానే జగన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు మూడు పార్టీలు జతకట్టాయి. 

ఈ ఐదు సంవత్సరాలు మీరు పడిన బాధ మే 13న బ్యాలెట్ బాక్స్ మీద చూపించండి. ఎమ్మెల్యే అభ్యర్ధిగా కొణతాల రామకృష్ణకు, ఎంపీ అభ్యర్ధిగా సీఎం రమేశ్ కు ఓటు వేసి రాక్షస పాలనను అంతం చేయాలి” అని నారా రోహిత్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News