Non Roti: నాన్ రోటీల్లో రకాలెన్ని?.. ఏ కర్రీతో ఏది బెటర్?
- చపాతీలకు ప్రత్యామ్నాయంగా చాలామంది ఎంచుకునే డిష్ ఇదే
- కర్రీ ఎంచుకునే విషయంలో చాలామందికి డైలమా
- కొన్నింటికి గ్రేవీ కర్రీలు బెస్ట్.. ఖీమానాన్‌కు కర్రీనే అక్కర్లేదు
చపాతీలకు ప్రత్యామ్నాయంగా చాలామంది ఎంచుకునే వాటిలో నాన్ రోటీ ఒకటి. చాలామందికి నాన్ రోటీల్లో ఒకటి రెండు రకాలు మాత్రమే తెలుసు. కానీ, ఇందులోనూ బోల్డన్ని రకాలున్నాయి. ఒక్కో కర్రీతో ఒక్కో రకమైన టేస్ట్ ఇచ్చే నాన్ రోటీలు అంటే ఇష్టపడని వారుండరు. మరి ఆ రోటీలేంటి? ఏ కర్రీలతో వాటిని ఎంజాయ్ చేయొచ్చో తెలుసుకుందాం.
గార్లిక్ నాన్
దీనిని సన్నగా తరిగిన వెల్లుల్లిని కలిపిచేస్తారు. స్పైసీగా ఉండే కర్రీలతో భలేగా లాగించేయొచ్చు.
బటర్ నాన్
నాన్ రోటీ వేడిగా ఉన్నప్పుడు బటర్ వేసి దీనిని తయారుచేస్తారు. బటర్ చికెన్, పన్నీర్, మఖానీతో ఎంచక్కా దీనిని ఎంజాయ్ చేయొచ్చు.
చీజ్ నాన్
దీనిని చీజ్ వేసి కాలుస్తారు. చీజ్‌ను ఇష్టపడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. స్పైసీ కర్రీల్లోకి బాగుంటుంది.
పన్నీర్ నాన్
రోటీని కాల్చడానికి ముందు రెండు వరుసల మధ్య పన్నీరు తురుము వేస్తారు. కాల్చినప్పుడు అది కరిగి రోటీ కాస్తంత మెత్తగా అవుతుంది. వెజ్ గ్రేవీ కర్రీలతో తినొచ్చు.
ఖీమా నాన్
రోటీ రెండు పొరల మధ్య వండిన చికెన్, మటన్ ఖీమాను పెట్టి దీనిని తయారుచేస్తారు. ఖీమా ఫ్లేవర్ రోటీలోకి దిగి టేస్ట్ అద్భుతంగా మారుతుంది. వీటిని ఎలాంటి కర్రీ లేకుండా నేరుగా తినొచ్చు.
ఆలూ నాన్
మసాలాలు వేసి వండిన ఆలూ కర్రీని మెత్తగా చేసి పిండి రెండు పొరల మధ్య వేసి కాలుస్తారు. చోళే, దాల్ మఖానాలతో తింటే భలే టేస్టీగా ఉంటుంది.
కశ్మీరీ నాన్
ఇది తీపి, ఘాటు ఉండే నాన్ రోటీ. పిండిలో పెరుగు, కొబ్బరి, పాలు, డ్రైఫ్రూట్స్, ఘాటైన మసాలాలు కలిపి కాలుస్తారు. టేస్ట్ అదుర్స్ అనేలా ఉంటుంది. వీటితోపాటు కొత్తిమీర, పుదీనా వంటివి చల్లి చేసే నాన్ రోటీల్లో ఆఫ్ఘనీ, పెషావరీ వంటివి ఉన్నాయి. ఈసారి మీరు ఎప్పుడూ తినే నాన్ రోటీ కాకుండా వీటిలో ఒకటి ట్రై చేసి చూడండి.