punjab: పవిత్ర గ్రంథాన్ని చింపాడని యువకుడిని కొట్టి చంపిన సిక్కులు
- పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారాలో ఘటన
- తన కుమారుడు మతిస్థిమితం లేని వాడన్న నిందితుడి తండ్రి
- కొట్టి చంపిన వారిపై కేసు పెట్టాలని పోలీసులకు వినతి
- దాడిని సమర్థించుకున్న సిక్కుల మత సంస్థ
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారాలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది. తాము అత్యంత పవిత్రంగా పరిగణించే గురుగ్రంథ్ సాహిబ్ గ్రంథంలోని కొన్ని పేజీలను చించాడనే ఆరోపణలపై ఓ యువకుడిని ఆందోళనకారులు కొట్టి చంపారు. బందాలా గ్రామంలో బాబా బీర్ సింగ్ గురుద్వారా ఉంది. బక్షీష్ సింగ్ అనే 19 ఏళ్ల యువకుడు ఆ గురుద్వారాలోకి ప్రవేశించి అక్కడున్న పవిత్ర గంథ్రంలోని కొన్ని పేజీలను చింపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని వెంబడించిన స్థానికులు పట్టుకొని విపరీతంగా కొట్టారు. చేతులను వెనక్కి విరిచికట్టి విచక్షణారహితంగా దాడి చేశారు.
నిందితుడిపై దాడి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అక్కడ మరణించాడు. అయితే నిందితుడి తండ్రి లఖ్వీందర్ సింగ్ మాత్రం తన కుమారుడికి మతిస్థిమితం లేదని చెప్పాడు. రెండేళ్లుగా అతనికి చికిత్స చేయిస్తున్నామని వివరించాడు. తన కుమారుడిని కొట్టి చంపిన వారిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. మరోవైపు స్థానికులు సైతం బక్షీష్ గతంలో ఎప్పుడూ గురుద్వారాను సందర్శించలేదని చెప్పారు.
ఈ ఉదంతంపై సిక్కుల మత సంస్థ అకల్ తక్త్ స్పందించింది. పవిత్ర గ్రంథాన్ని ధ్వంసం చేసే ఘటనలను పునరావృతం కాకుండా చూడటంలో చట్టం విఫలమైందని విమర్శించింది. దోషులను శిక్షించడంలో చట్టం విఫలం కావడంతో న్యాయం కోసం ప్రజలు తిరగబడ్డారని.. అందుకే నిందితుడు మరణించాడని ఆ సంస్థ జతేదార్ జ్ఞానీ రఘ్బీర్ సింగ్ సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశారు. నిందితుడి అంత్యక్రియలను ఏ గురుద్వారాలో నిర్వహించరాదని.. అతని కుటుంబాన్ని సామాజికంగా, మతపరంగా వెలి వేయాలని సిక్కులకు పిలుపునిచ్చారు.