Prajwal Revanna: 28 ఏళ్లకే ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి విదేశాలకు పారిపోయేదాకా.. ప్రజ్వల్ రేవణ్ణ పతనం!
- 28 ఏళ్లకే ఎంపీగా ఎన్నికైన ప్రజ్వల్
- దేవెగౌడ నియోజకవర్గం నుంచి ఎన్నిక
- మనవడి కోసం సీటును త్యాగం చేసిన మాజీ ప్రధాని
- తాజాగా బయటపడ్డ సెక్స్ వీడియోల తర్వాత జర్మనీకి పరార్
లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకను కుదిపేస్తున్న తాజా అంశం సెక్స్ స్కాండల్.. ఏకంగా మూడు వేల దాకా వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ బయటకు రావడంతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ యువ ఎంపీ తన కుటుంబ పలుకుబడిని, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం, ఆ ఘటనలను వీడియోలు తీసుకుని భద్రపరుచుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గన్ తో బెదిరించి అత్యాచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంట్లో పనివాళ్ల నుంచి మొదలుకొని నియోజకవర్గం నుంచి తనను కలిసేందుకు వచ్చే మహిళలపై ఈ దారుణాలకు తెగబడ్డాడు. ఎట్టకేలకు పాపం పండింది. తను తీసుకున్న వీడియోలే ఇప్పుడు తన మెడకు చుట్టుకున్నాయి. రాజకీయ భవిష్యత్తునే కాదు అసలు భవిష్యత్తు అనేదే లేకుండా చేశాయి. అరెస్టును తప్పించుకోవడానికి దేశం విడిచి పారిపోయేలా చేశాయి. కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ కేసు వివరాలు..
ఎవరీ ప్రజ్వల్..
తాత దేవెగౌడ మాజీ ప్రధాని, తండ్రి హెచ్ డీ రేవణ్ణ మాజీ కేంద్ర మంత్రి, చిన్నాన్న హెచ్ డీ కుమార స్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.. కుటుంబ పార్టీ జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) కూ ఘనమైన చరిత్రే ఉంది. క్లుప్తంగా ఇదీ ప్రజ్వల్ రేవణ్ణ బ్యాక్ గ్రౌండ్.. దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు ప్రజ్వల్ ఏడేళ్ల కుర్రాడు. 2006లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయానికి టీనేజీలోకి అడుగుపెట్టాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసినా మొదటి నుంచీ రాజకీయాలపైనే ఆసక్తి చూపించాడు. అయితే, ఆది నుంచీ ప్రజ్వల్ తీరు వివాదాస్పదమే. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వడానికి కుమారస్వామి నిరాకరించగా.. తండ్రి దేవెగౌడ సూచనలతో, తండ్రి నియోజకవర్గం నుంచే బరిలోకి దింపక తప్పలేదని సమాచారం.
చిన్నాన్నపైనా విమర్శలు..
ఆ సమయంలో చిన్నాన్నపైనా ప్రజ్వల్ విమర్శలు గుప్పించాడు. పార్టీలో కష్టపడే వారిని వెనకాల కూర్చోబెట్టి సూట్ కేసులతో వచ్చే వారిని ముందు వరుసలో కూర్చోబెడుతున్నారంటూ కుమారస్వామిపై విమర్శలు చేశాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి 28 ఏళ్ల వయసులో లోక్ సభలో అడుగుపెట్టాడు. కుటుంబ నేపథ్యానికి తోడు కొత్తగా వచ్చి చేరిన అధికారంతో ప్రజ్వల్ విర్రవీగాడు. మహిళలపై అరాచకాలకు పాల్పడ్డాడు. ఉద్యోగం కోసమో, మరో సమస్యతోనో తనను కలవడానికి వచ్చిన వారిపై అఘాయిత్యం చేశాడు. బదిలీ చేయించాలంటూ వచ్చిన ఉద్యోగినులపైనా వేధింపులకు దిగాడు.
తన చేష్టలన్నీ సెల్ కెమెరాలో రికార్డు చేసుకునేవాడు. ఇలా దాదాపు వంద మంది మహిళలపై దారుణానికి తెగబడ్డ సుమారు 2,976 వీడియోలు ఓ పెన్ డ్రైవ్ లోకి చేరాయి. ఆ పెన్ డ్రైవ్ ఇటీవల బయటకు రావడం, అందులోని వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో రాష్ట్రంలో సంచలనం రేగింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు బాధితుల ముఖాలు కూడా క్లియర్ గా కనిపించడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధితులలో ప్రజ్వల్ రేవణ్ణ ఇంట్లో పనిచేసే మహిళలు, జేడీఎస్ మహిళా నేతలు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల ముందు దుమారం..
లోక్ సభ ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు.. ఏప్రిల్ 16న ఈ పెన్ డ్రైవ్ బయటకు వచ్చింది. ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగగా మరుసటి రోజు ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పారిపోయాడు. డిప్లొమాటిక్ పాస్ పోర్టు సాయంతో చెప్పాపెట్టకుండా మాయమయ్యాడు. రాష్ట్రంలో సంచలనం రేగడం, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దర్యాఫ్తునకు సిట్ ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, కేంద్ర మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ కూడా పలువురు మహిళలపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. రేవణ్ణ దగ్గరి బంధువయ్యే ఓ మహిళ పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన అఘాయిత్యం వివరాలను వెల్లడించింది. తనను, తన కూతురును ఆ తండ్రీ కొడుకులు లైంగికంగా వేధించారని కేసు పెట్టింది. మరో కిడ్నాప్ కేసులోనూ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు.
లుకౌట్ నోటీసులు..
విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రజ్వల్ దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే.. విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. వెంటనే తమ ముందు హాజరై వేధింపుల ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ప్రజ్వల్ కు సిట్ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, దీనికి తనకు వారం రోజులు సమయం కావాలని తన లాయర్ ద్వారా ప్రజ్వల్ విజ్ఞప్తి చేయగా.. సిట్ తిరస్కరించింది. కాగా, హెచ్ డీ రేవణ్ణ అరెస్టు, ప్రజ్వల్ రేవణ్ణ పరారీ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్పందించారు. ప్రజ్వల్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజ్వల్ ను దేశానికి తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడతామని చెప్పారు.