Amit Shah: కూటమిని గెలిపించండి... ఏపీలో అభివృద్ధి సంగతి మేం చూసుకుంటాం: అమిత్ షా

Central Minister Amit Sha Speech At Dharmavaram Prajagalam Sabha

  • లేపాక్షి ఆలయం, సత్యసాయి బాబాకు నమస్కరించి ప్రసంగం ప్రారంభం
  • అరాచక పాలనపై పోరాడేందుకే ఏపీలో కూటమి కట్టామన్న కేంద్ర హోంమంత్రి
  • ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడమే పొత్తు లక్ష్యమని వివరణ

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక పాలనకు ముగింపు పలకడానికే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. ఏపీలో అవినీతిపై జరుగుతున్న పోరాటానికి మద్ధతు తెలిపేందుకే తాను రాష్ట్రానికి వచ్చానని వెల్లడించారు. ఈమేరకు ధర్మవరంలో కూటమి తరఫున ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. సభావేదికపై ఆసీనులైన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మిగతా నేతలందరికీ నమస్కారం తెలిపారు. శ్రీరాముడు జటాయువును కలుసుకున్న పవిత్ర భూమి హిందూపూర్ కు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పూజలందుకున్న సత్యసాయి బాబాకు ఈ సందర్భంగా నమస్కరిస్తూ ప్రసంగం ప్రారంభించారు. అమిత్ షా హిందీలో ప్రసంగించగా ధర్మవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న బీజేపీ నేత సత్య కుమార్ తెలుగులోకి అనువదించారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లోక్ సభ తో పాటు శాసన సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని అమిత్ షా చెప్పారు. ఈ ఎన్నికల్లో అవినీతిపై, అక్రమార్కులపై పోరాడేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన నడుం బిగించాయని వివరించారు. ఈ పోరాటానికి బలం చేకూర్చడానికే తాను ఈ రోజు ధర్మవరం వచ్చానని తెలిపారు. ఏడు దశలలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఈ రెండు దశలలో మోదీ సెంచరీ పూర్తి చేశారని (వంద సీట్లు గెల్చుకున్నారని) చెప్పారు. మూడో దశ పోలింగ్ లో 400 సీట్లు సాధించే దిశగా దూసుకెళుతున్నారని అమిత్ షా వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎందుకు కట్టామంటే..
ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేయడానికి కారణమేంటని తనను మీడియా మిత్రులు అడిగారని అమిత్ షా చెప్పారు. కూటమి లక్ష్యం ఏంటని అడిగిన ప్రశ్నకు ఈ సభావేదికగా జవాబిస్తానని వివరించారు. 

‘ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ చేతులు కలిపారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఏకమయ్యాయి. రాష్ట్రంలో గూండాగిరిని, నేరస్థుల ఆటకట్టించేందుకే పొత్తు పెట్టుకున్నాం. ఏపీలో అవినీతి పాలనకు ముగింపు పలికేందుకే పొత్తు పెట్టుకున్నాం. ల్యాండ్ మాఫియా పీచమణచడానికి, అమరావతిని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడానికి పొత్తుపెట్టుకున్నాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతను పునఃస్థాపితం చేయడానికి పొత్తు పెట్టుకున్నాం. తెలుగు భాషను పరిరక్షించేందుకు పొత్తుపెట్టుకున్నాం. జగన్ రెడ్డీ... గుర్తుంచుకో... బీజేపీ ఉన్నంతకాలం తెలుగు భాషను అంతం కానివ్వం.

 రాష్ట్రంలో తెలుగు భాషను నిర్వీర్యం చేయాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. కానీ బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను కాపాడుకుంటాం.. తెలుగును అంతరించిపోకుండా చూసుకుంటాం. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను  గెలిపించండి... రాష్ట్ర అభివృద్ధిని మాకు వదిలేయండి. 

పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో  బీజేపీ కీలకపాత్ర పోషించింది.  ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారు.‘ అని అమిత్ షా పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News